ఓవైపు ఆందోళనలు, ఆత్మాహత్యలు, వెరసి ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు. హోదా కోసం అటు కేంద్రంగానీ, ఇటు రాష్ట్రంలోగానీ అధికార పక్షాలు ఏం చెప్పట్లేదు. రెండు భిన్న ధృవాల్లా స్టేట్ మెంట్లు ఇవ్వటం కూడా అయోమయానికి గురిచేస్తున్నాయి. అయితే ప్రత్యేకంపై పాజిటివ్ గా మాట్లాడి ధైర్యం చెప్పాల్సిన అధికార పక్ష నేతలే... పిరికి మాటలు నూరిపోస్తుంటే ప్రజల పరిస్థితి ఏంటి?
ప్రత్యేక హోదా విషయంలో తాజాగా స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రత్యేక హోదా పై మీడియాతో ముచ్చటించారు. ప్రత్యేక హోదా అన్ని సమస్యలకు జిందా తిలిస్మాత్ లాంటిది కాదని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాతోనే అన్ని సమస్యలకు పరిష్కారం ఉంటుందని అనుకోకూడదని కోడెల చెప్పారు. ప్రత్యేక హోదాపై అసలు రాజకీయాలు, పోరాటాలు కూడా అవసరం లేదని ఆయన అన్నారు. అసలు ఇది ఈ రోజు అడుగుతున్న డిమాండ్ కాదని, విభజన సమయంలోనే కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందని హామీ ప్రకటించిందని, ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం అధికరాపక్షంతో పాటు ప్రతిపక్షాలకు కూడా పోరాడాల్సిన బాధ్యత ఉందన్నారు.
కోడెల అసెంబ్లీ స్పీకర్. బాధ్యతగల పదవి అని గొంతు విరుచుకుని చెప్పాల్సిన అవసరం లేదు. అయినా ఈ పరిస్థితుల్లో ప్రత్యేకంతో ఒరిగేదేం లేదు, దాని కోసం పోరాడాల్సిన అవసరం లేదని మాట్లాడం ఆయన లాంటి వారు మాట్లాడాల్సిన మాటలు కాదు. ఉద్యమాలు చేస్తాం..ప్రాణాలు తీసుకుంటాం అనడం సరికాదని చెప్పటం వరకు ఓకే గానీ, ప్రత్యేక హోదా తో కలిగే తక్కువ లాభాల గురించి వివరంగా చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారిచ్చే ప్రకటనలు ఆందోళన కలిగించేలాగానే ఉన్నాయి. మొన్నా జేసీ, ఇవాళ కోడెల ఇలా నేతలకే తమపై తమకు నమ్మకం లేకపోతే ప్రజల్లో ఏం మనోధైర్యం నింపుతారు. ప్రయోజనాలు ఏ రూపంలో వచ్చినా ఫర్లేదు అన్నది అర్థమయ్యేలా చెప్పటం ఇప్పుడు అధికార పక్షాలకు ఉన్న బాధ్యత అంతేగానీ దాంతో అవసరం లేదు. ఒరిగేది లేదు అంటూ నెగటివ్ గా మాట్లాడితే పోయేది ప్రజల ప్రాణాలే. ఇది ఒక్క కోడెలనే కాదు... మొత్తం నేతలు గుర్తుపెట్టుకుంటే మంచిది.