ఓవైపు అధికార పక్షంలోకి వలసలు కొనసాగుతున్నా... పార్టీని వీడకుండా, జిల్లాలోనూ తన ప్రాబల్యం తగ్గకుండా నెట్టుకోస్తున్నారు కాంగ్రెెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. తాజా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలను ఛాలెంజింగ్ గా తీసుకుని తన సోదరుడు రాజగోపాల్ రెడ్డిని బరిలోకి దించాడు. అధికార పార్టీ బలం ముందు అదంతా ఉత్తదేనని అంతా అనుకున్నారు. కానీ, టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హోరాహోరీగా సాగిన నల్లగొండ స్థానం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. 158 ఓట్ల మెజారిటీతో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి చిన్నపరెడ్డిని చిత్తు చేశారు.
జిల్లాలో స్థానిక సంస్థల్లో మెజారిటీ బలమున్న తాము ఎమ్మెల్సీ సీటును కైవసం చేసుకుంటామని రాజగోపాల్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. తన సోదరుడు ఓటమిపాలైతే, తాను రాజకీయాల నుంచే తప్పుకుంటానని ఆయన ప్రకటించారు కూడా. వెంకటరెడ్డి చెప్పినట్లుగానే బుధవారం ఉదయం ప్రారంభమైన కౌంటింగ్ లో ఆది నుంచి రాజగోపాల్ రెడ్డి ఆధిక్యం సాధించారు. ఏ దశలోనూ వెనకబడని ఆయన చిన్నపరెడ్డికి షాకిస్తూ 158 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాజగోపాల్ రెడ్డికి 616 ఓట్లు పడగా, చిన్నపరెడ్డి మాత్రం 458 ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో గులాబీ పార్టీకి పెద్ద షాక్ తగిలింది.