ఓవైపు గ్రేటర్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తెలంగాణలో ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి అధికార పక్షంలోకి వలసలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పార్టీలో ప్రాభావ్యం లేకపోవటం, అధికార పార్టీలో ఉంటే పనులు చక్కబెట్టుకోవచ్చన్న ఆలోచనతో చాలా మంది తమ పార్టీకి చెయ్యిచ్చి కారు ఎక్కేస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రస్తుతం సేమ్ సీన్ కనిపిస్తోంది. అధికారం లో ఉండగా కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత తనయుడు జగన్ స్థాపించిన వైకాపాలోనూ చేరాడు. మొదట్లో కీలక నేతగా వ్యవహరించిన ఆయన రాను రాను తన ప్రాధాన్యం తగ్గిపోవటంతో అసంతృప్తి వెల్లగక్కారు. అధినేత జగన్ విధానాలు నచ్చని కారణంగా కొంతకాలం క్రితం బహిరంగ లేఖ రాసిన కొణతాల ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. అయితే అప్పట్లో ఆయన బీజేపీ కండువా కప్పుకుంటారనే వార్తలు గుప్పుమన్నాయి. కానీ, దాదాపు ఏడాది పాటు ఏ పార్టీలోనూ చేరకుండా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
ఈమధ్య టీడీపీలో కొణతాల చేరుతున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలు కూడా ఉత్తదేనంటూ ఆయన సహచరులు చెప్పుకొచ్చారు. నేటి ఉదయం అందరికీ షాకిస్తూ కొణతాల టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. తన సొంత జిల్లాకు చెందిన మరో కీలక నేత గండి బాబ్జీతో కలిసి కొణతాల టీడీపీ అధినేతతో భేటీ అయ్యారు. దీంతో టీడీపీలో కొణతాల చేరిక ఖరారైపోయింది. ఇక ముహూర్తం ప్రకటనే తరువాయిగా మారింది. మొత్తానికి అధికార పక్షాల ఆకర్ష్ కి వరుస వలసలతో ఇరు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలకు షాక్ లు తగులుతున్నాయి. అయితే ఇక్కడ కామన్ గా నష్టపపోయేది మాత్రం గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్సే.