టెక్నికల్ ఎమ్మెల్యే అంటే ఏంటి కృష్ణయ్య?

February 15, 2016 | 11:40 AM | 1 Views
ప్రింట్ కామెంట్
krishnaiah-quit-TDP-but-not-resign-for-MLA-niharonline

తెలంగాణ టీడీపీ దుకాణం బంద్ అవుతున్న వేళ ఆ పార్టీకి ఎటు పాలుపోని పరిస్థితి. ఐదుగురిలో  మరో ఇద్దరు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వస్తున్నాయి. మిగిలిన ముగ్గురిని మాత్రం ఎట్టి పరిస్థితిలో చేర్చుకోబోమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో రేవంత్ రెడ్డి, మాగంటి గోపినాథ్, ఆర్. కృష్ణయ్య, సండ్ర వెంకటవీరయ్య, గాంధీ మాత్రమే ఉన్నారు. వారిలో రేవంత్ రెడ్డిని ఖచ్ఛితంగా రానివ్వరన్నది తెలిసిందే. ఇక మిగిలిన నలుగురిలో మాగంటి మొండిపట్టుతో ఉన్నట్లు సమాచారం. సండ్ర పరిస్థితి కూడా దాదాపు అదే రీతిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక శేర్ లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ మాత్రం చేరవచ్చేనే వార్తలు వినవస్తున్నాయి. మరి కృష్ణయ్య పరిస్థితి ఏంటీ?

ఈ మధ్యే తనకు టీడీపీకి సంబంధాలు తెంచుకుంటున్నట్లు ప్రకటించిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఎందులోనూ చేరనని, కేవలం ఉద్యమ నేతగా కొనసాగుతానని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. మరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అన్న ప్రశ్నకు క్లారిటీ లేని సమాధానమిస్తున్నారీ బీసీ సంఘాల నేత. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సీఎంగా తనను చేస్తానని మాటిచ్చిన మీదటే, ఆ పార్టీలో చేరాను తప్ప, తనకు రాజకీయాలంటే పెద్దగా ఇష్టం లేదని అన్నారు. తాను సీఎం అయితే బీసీ జాతి అభివృద్ధి చెందుతుందన్న ఒకే కారణంతో తెలుగుదేశంలో చేరానని మరోసారి అన్నారు.

గ్రూప్ 1, గ్రూప్ 2, బ్యాంకు ఆఫీసర్ వంటి ఉద్యోగాలు ఎన్నో వచ్చాయని, వాటన్నింటికీ రాజీనామా చేసి గడచిన 40 సంవత్సరాలుగా బీసీల అభ్యున్నతి కోసం శ్రమిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. తాను టెక్నికల్ గా మాత్రమే ఎమ్మెల్యేనని అన్నారు. గతంలోనే తనకు ఎన్టీఆర్ తో పాటు చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి తదితరులు మంత్రిపదవులు ఆఫర్ చేశారని గుర్తు చేసుకున్నారు. ఇక చివర్లోనే అసలు ట్విస్ట్ ఇచ్చారాయన. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అనుకున్నానని, అయితే, అమెరికా తదితర దేశాల నుంచి వచ్చి తనకు ఓట్లు వేశారని చెప్పుకొచ్చాడు. వారి అభిమానానికి కట్టుబడి ఎమ్మెల్యే పదవిలో కొనసాగుతున్నానని ఆయన అంటున్నారు. సూటిగా సుత్తి లేకుండా రాజీనామా చెయ్యను అని చెప్పోచ్చుగా, ఈ గతం, టెక్నికల్ అంటూ ఎందుకు కృష్ణయ్య?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ