లగడపాటి బీజేపీ ఫ్లెక్సీలు... తిట్లు అంతా డ్రామానా?

February 16, 2016 | 11:21 AM | 3 Views
ప్రింట్ కామెంట్
Lagadapati_rajagopal_BJP_TDP_political_reentry_niharonline

తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోడానికి శతవిధాల ప్రయత్నించి భంగపడ్డ ఆంధ్రా నేతలో ఒకరు, కాదు.. కాదు... ప్రముఖుడు ల(జ)గడపాటి రాజగోపాల్. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గాంధేయవాదినంటూ జాతీయ జెండా పట్టి విజయవాడలో దీక్ష చేయటం మొదలు, నిమ్స్ లో హల్ చల్ చేయటం, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏకంగా తెలంగాణవాదుల చేతి దెబ్బ రుచిచూడటం, చివరగా పునర్విభజన బిల్లుపై చర్చ సమయంలో పార్లమెంట్ లో  పెప్పర్ స్ప్రే అటాక్ ఆయన పొలిటికల్ కెరీర్ కే హైలెట్.

                        అయితే విభజనను అడ్డుకోలేక చతికిలపడి చివరాఖరికి ఏకంగా రాజకీయ సన్యాసమే తీసుకున్నారాయన. ఇక మళ్లీ ఏం గుర్తొచ్చిందో ఏంటో తిరిగి రాజకీయ ప్రవేశం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. మళ్లీ ఆయన రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారంటూ సోమవారం విజయవాడలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. లగడపాటి పుట్టినరోజు సందర్భంగా తిరిగి రాజకీయాల్లోకి రావాలని కాంక్షిస్తున్నట్లు ఆయన సన్నిహితుల పేరిట కొన్ని ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే వాటిల్లో బీజేపీ నేతల ఫొటోలతో పాటు కొన్ని చోట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫొటోలు కూడా కనిపించాయి. ఈ క్రమంలో లగడపాటి బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జోరందుకుంది.

                      మరోవైపు దీన్ని వ్యతిరేకిస్తూ కూడా కొన్ని ప్లెక్సీలు ఏర్పాటు కావడం కలకలం రేపింది. దానికి కారణం ఆయనపై గతంలో ఆరోపణలు ఉండటమే. రాజకీయాలను వంక పెట్టుకుని అక్రమంగా రూ. 75 వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని, ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి మరింత దోచుకోవాలని చూస్తున్నారా? అంటూ కొన్ని ప్లెక్సీలు వెలిశాయి. "75 వేల కోట్ల రూపాయలను బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకుని, బ్యాంకులను ముంచి, కుటుంబం పేరు మీద విదేశాలలో అక్రమ ఆస్తులను కూడ పెట్టుకున్న లగడపాటి రాజగోపాల్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు. కొత్తగా రాజకీయ్యాల్లోకి వస్తున్న సందర్భంగా మరెన్నో వేల కోట్ల రూపాయలను కూడబెట్టుకోవాలని ఆకాంక్షిస్తూ... మీ అభిమానులు" అని రాసివుంది. మధ్యలో "చాలవు... ఇంకా కావాలి" అన్న స్లోగన్ కూడా ఉంది. దీనిపై ఆయన అనుచరులు గుర్రుమన్నారు. తమ అభిమాన నేతకు వ్యతిరేకంగా ఉన్న ప్లెక్సీలను లగడపాటి అనుచరులు చించివేశారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆయన బీజేపీలో చేరతారని కొందరు, కాదు టీపీపీలో చేరతారని మరికొందరు బెట్టింగులు వేసుకుంటున్నారంట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ