మోదీ హవాను దెబ్బ కొడుతూ రికార్డుస్థాయిలో బీహార్ లో ఘన విజయం సాధించింది మహకూటమి. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడి కొద్దిగంటలు గడవకముందే కూటమిలో ముసలం మొదలైనట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. బీహార్ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఆర్జేడీ నుంచి మోతాదుకు మించి డిమాండ్లు లేవనెత్తుతున్నాయట. ఎలాగైనా సరే తన పార్టీకి చెందినవారిని మంత్రివర్గంలో నిలపాలనే ఆయన ప్రయత్నం ప్రస్తుతం కూటమిలో చర్చకు దారితీస్తుందట. దీనిపై పలువురు సీనియర్లు వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆయన మాత్రం మొండివైఖరితో ఉన్నట్లు సమాచారం. తన పార్టీకి చెందిన పలువురికి కీలక మంత్రి పదవులు కట్టబెట్టాలని సీఎం నితీశ్ కుమార్ పై ఒత్తిడి మొదలైనట్టు తెలుస్తోంది.
వాస్తవానికి అసెంబ్లీలో లాలూ పార్టీ బలమే ఎక్కువ. ఆ విజయం ఆయన కూడా ఊహించలేదు. కానీ, సీఎంగా అభ్యర్థిగా ముందునుంచే నితీశ్ పేరును ప్రతిపాదించటంతో మిగతా కీలక పదవులపై ఇప్పుడు లాలూ కన్నేశారట. ఇక ఈ ఎన్నికల్లో లాలూ కుమారులు ప్రతాప్, తేజస్వీలు ఇద్దరూ విజయం సాధించారు. వీరిలో ఎవరికి మంత్రి పదవిని సిఫార్సు చేయాలన్నది లాలూకు పెద్ద సవాలే.
వీరిద్దరితోపాటు తన కుమార్తె మీసా భారతికి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఇద్దరు కుమారుల్లో ఒకరికి కీలకమైన మంత్రి పదవి తప్పనిసరిగా ఇవ్వాలని కోరుతున్నారట. ఎమ్మెల్సీగా ఉండి, ఎమ్మెల్యే బరిలో దిగి విజయం సాధించిన లాలూ పీఏ భోలా యాదవ్ ఎమ్మెల్సీ స్థానాన్ని మీసాకు ఇచ్చి, ఆమెను డిప్యూటీ సీఎంగా చూసుకోవాలని లాలూ భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే నితీశ్ కు తన మనసులోని మాటను నితీశ్ కు తెలియజేసినట్లు తెలుస్తోంది. మొత్తం 36 మందికి మంత్రి పదవులు లభించే అవకాశం ఉండగా, తొలి దశలో 25 నుంచి 27 మందికి పదవులు లభించే అవకాశం ఉంది. ఇంకోవైపు కూటమిలో భాగస్వామి అయిన కాంగ్రెస్ కూడా మంత్రివర్గంలో భాగస్వామి కావాలని కొరుకుంటుందట. కీలకమైన 1 మంత్రి పదవితోపాటు మొత్తం మూడు పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.