రాజకీయాల్లోకి దిగాను కదా ఇక పూర్తిగా వీటి మీదే నా దృష్టంతా, త్వరలో సినిమాలకు గుడ్ బై అని ఓపెన్ గా ప్రకటించేశాడు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. ఎన్టీఆర్ నుంచి నటవారసత్వంతోపాటు రాజకీయాలను కూడా తీసుకుని ఎవరూ ఊహించని స్థాయిలో దూసుకెళ్తున్నాడు బాలకృష్ణ. టీడీపీలో ఉద్ధండ పిండాలున్నా ఎవరికీ అందని రీతిలో అభివృద్ధిని సాధించుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే వందల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చెయ్యటంతోపాటు వాటిని దగ్గరుండి మరీ చూసుకుంటున్నారాయన. అంతేకాదు మంత్రుల ముక్కు పిండి మరిన్నీ నిధులను రాబట్టుకుంటున్నాడు. అయితే బాలయ్యకు ప్రజా సేవ చెయ్యటం ఇప్పుడేం కొత్తకాదు.
తల్లి హఠాన్మరణం అనంతరం ఎవరూ కాన్సర్ బారిన పడి మరణించొద్దన్న ఆశయంతో నెలకొల్పిన ఆస్పత్రి బసవ తారకం ఇండో కాన్సర్. అది అందించే సేవలు అంతా ఇంతా కాదు. పూర్తిస్థాయి విదేశీ ట్రీట్ మెంట్ తో సామాన్య ప్రజానీకాన్ని చికిత్స అందిస్తూ ఆదర్శప్రాయంగా నిలపటంలో నందమూరి ఫ్యామిలీది ముఖ్యంగా బాలయ్య కృషి మరువలేనిది. అయితే విభజన అనంతరం ఆస్పత్రి తెలంగాణ కే పరిమితం కావటంతో ఇక ఇప్పుడు పునరాలోచనలో పడ్డారట. ఏపీ వాసులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అక్కడ కూడా ఓ ఆస్పత్రిని నిర్మించాలని ఇప్పటికే నందమూరి కుటుంబం డిసైడ్ అయ్యింది. ఈ బృహత్ బాధ్యతలన్నీ బాలయ్యకే అప్పగించాలని కుటుంబం తీర్మానించిందట.
సుమారు రూ.500కోట్లతో నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుందట. ఇందుకోసం 50 ఎకరాల స్థలాన్ని కూడా ప్రభుత్వం ఇచ్చేందుకు సుముఖత చూపింది. గుంటూరు జిల్లా నల్లపాడు లో ఈ ఆసుపత్రి ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు టాక్. ఇక నిధుల సమీకరణను ఎన్ ఆర్ ఐల నుంచే గాక పారిశ్రామికవేత్తలు, వీవీఐపీలు కూడా ఇచ్చేందుకు భారీగా ముందుకు వస్తున్నారట. ఇక బాలయ్య బరిలోకి దిగితే పని అవ్వటం పెద్ద కష్టమేమీ కాదు. సినిమాలు వేరు... రాజకీయాలు వేరు అని మాట్లాడేవారికి బాలయ్య వైఖరి ఓ చెంపపెట్టులాంటిదని చెప్పకనే చెప్పొచ్చు.