తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోరు విప్పకపోవటం ఏపీ ప్రతిపక్షపార్టీ వైఎస్సార్సీపీ కడిగిపారేస్తున్న విషయం తెలిసిందే. ప్రశ్నిస్తామంటూ వచ్చిన జనసేన ఈ వ్యవహారంలో ఎందుకు నోరు మెదపటం లేదంటూ వైకాపా నేతలు పవన్ పై ప్రత్యక్ష మాటల దాడికి దిగారు. అంబటి రాయుడు లాంటి నేతలైతే పవన్ ను ‘చంద్రబాబుకు పెయిడ్ ఆర్టిస్టులా వ్యవహరిస్తున్నావంటూ’ ఘాటుగా విమర్శించాడు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇరు రాష్ట్రాలలో నెలకొన్న అన్ని పరిణామాలపై తన అభిప్రాయాలను స్పష్టం చేస్తానని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఓటుకు నోటుతోపాటు సెక్షన్ 8 పై తన అభిప్రాయాలను మీడియా సమక్షంలో తెలుపుతానని వెల్లడించారు. అయితే అంతకు ముందు పవన్ చేసిన ట్వీట్లు ఆసక్తికరంగా ఉన్నాయి. 'తల్లి తండ్రులు తిట్టుకుంటు లేస్తే పిల్లలు కొట్టుకుంటు లేస్తారని అంటారు' అలాగే పాలకులు బాధ్యత లేని ప్రవర్తనతో,మాటలుతో ప్రభుత్వాలని నడిపితే... 'భావితరాల మధ్య తిరిగి కోలుకోలేనంత అంతర్యుద్ధాలు సంభవిస్తాయి'. అని ఆయన చేసిన ట్వీట్లు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇంకోవైపు విమర్శలు వెలువెత్తిన నేపథ్యంలో ఇలా పవన్ స్వయంగా ముందుకు మీడియా సమావేశంలో తన అభిప్రాయాలను చెబుతాననడంతో ఆసక్తికరంగా మారింది. మరి మీడియా సమక్షంలో పవన్ ఎలాంటి అభిప్రాయలను వెల్లడిస్తారో అన్న ఉత్కంఠ ఓవైపు నేతలతోపాటు అభిమానుల్లో కూడా నెలకొంది.