తెలంగాణ మంత్రులంతా జైలుకెళతారా??

October 09, 2015 | 05:32 PM | 2 Views
ప్రింట్ కామెంట్
madhu-yaskhi-goud-kcr-on-farmers-suicide-bandh-niharonline

తెలంగాణ కేబినెట్ లో ఇప్పుడున్న మంత్రుల్లో ఎవరి మీద ఆరోపణలుగానీ, కేసులుగానీ లేవు. తన కన్నుసన్నల్లోనే మంత్రులందరిని అదుపులో పెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రతిపక్షాలకు విమర్శించే అవకాశాని అస్సలు కల్పించొద్దన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు వారిస్తూ వస్తున్నారాయన.  మరి అంత జాగ్రత్తగా ఉన్న టైంలో మంత్రులంతా ఎందుకు జైలుకి వెళతారు. అసలా అవసరం ఏంటి?

                        ఇది ప్రతిపక్షం నుంచి వచ్చిన దీవెనలు లేండి. రైతుల రుణమాఫీ పై శనివారం విపక్షాలన్నీ ఏకమై తెలంగాణవ్యాప్తంగా బంద్ నిర్వహించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత మధుయాష్కీ శుక్రవారం మీడియా ముందు మాట్లాడారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ కి త్వరలో బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో మంత్రులుగా అధికారం వెలగబెడుతున్నవారంతా జైలుపాలు కాక తప్పదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కల్లబొల్లి కబుర్లతో దొంగ రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

రైతు రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేయాలని అసెంబ్లీలో అడిగిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి రైతులంటే చులకన అని, వారికి మేలు చేయడం కేసీఆర్ కి ఇష్టం లేదని ఆయన విమర్శించారు. రేపు విపక్షాలు పిలుపునిచ్చిన బంద్ ను తెలంగాణ ప్రజలు విజయవంతం చేయాలని ఆయన సూచించారు. లేని పక్షంలో గడీల రాజ్యాన్ని తెలంగాణ ప్రజలు చూడాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. 2019లో తెలంగాణలో అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంటుందని అప్పుడు మళ్లీ రైతలకు మంచి రోజులు వస్తాయని మధుయాష్కీ తెలిపారు. ఇక ఇది విన్న టీఆర్ఎస్ నేతలు మధుయాష్కీ మంచి జోక్ వేశారని నవ్వుకున్నారట. మరి ఈ మాజీ ఎంపీ కోరిక నెరవేరుతుందంటారా?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ