సూపర్ స్టార్లు అనే పదం సాధారణంగా సినిమాల్లో వాడేది, తమ అద్భుతనటనతో రాణిస్తూ వస్తున్న లెజెండ్ లకు ఈ బిరుదును మనం కట్టబెడతాం. కానీ, దీనిని ఇప్పుడు రాజకీయాలను అన్వయించారు ఇక్కడ ఓ సిద్ధాంతి. ఈ బిరుదాంకితుడు ఎవరో కాదు ఏపీ ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని. దుర్ముఖి నామ సంవత్సరాదిని పురస్కరించుకుని ఉగాది పంచాగం సందర్భంగా ఓ సిద్ధాంతి జగన్ మీద ఈ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాదు లోటస్ పాండ్ వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంచాగ శ్రవణం జరిగింది. దీని నిర్వహించిన ప్రముఖ పంచాంగకర్త మారేపల్లి రామచంద్రశాస్త్రి తొలిసారిగా ఈ కొత్త పదాన్ని వాడారు.
తన పంచాంగ శ్రవణంలో భాగంగా సాంతం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టే తిరిగాడు మారేపల్లి. జగన్ ను పొలిటికల్ సూపర్ స్టార్ గా అభివర్ణింస్తూ కుట్రలు, కుతంత్రాలతో పెట్టిన అన్ని కేసుల నుంచి కడిగిన ముత్యంలానే కాక 24 కేరట్ల బంగారంలా జగన్ బయటపడతారని శాస్త్రి సెలవిచ్చారు. అంతేకాకుండా దుర్ముఖి నామ సంవత్సరంలో వైసీపీ భవిష్యత్తు బ్రహ్మాండంగానూ ఉందని మారేపల్లి వెల్లడించారు. రాష్ట్రంలో చల్లని గాలి వీయాలంటే ఫ్యాన్ అధికారంలోకి రావాల్సిందేనంటూ పేర్కొన్నారు. నటనలో మెప్పించిన వారికి వాడే ఈ పదాన్ని జగన్ కు వాడారంటే కొంపదీసి ఆయన రాజకీయాల్లో సూపర్ గా యాక్ట్ చేస్తున్నారా ఏంటి అన్న కోణంలోనే మారేపల్లి వ్యాఖ్యలు ఉన్నాయా అనే సందేహాం కలగక మానదు. చివర్లో పార్టీ భవిష్యత్తు బాగుంటుందనేది చెప్పటం పెద్ద కొసమెరుపు! అన్నట్లు గతేడాది పంచాగం శ్రవణ సమయంలో వచ్చే ఎన్నికలలో జగన్ సీఎం అవుతాడని చెప్పింది కూడా ఈయనగారే.