కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పై ఓ రేంజ్ లో సెటైర్లు వేశారు. మంగళవారం యూపీలోని రాహుల్ నియోజకవర్గం అమేథీలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రాహుల్ గత మూడు నెలలుగా నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదని ఆమె అన్నారు. రెండు నెలలు అజ్ణాతంలో ఉండి, ఇప్పుడు రైతులను పరామర్శించటం పెద్ద డ్రామా అని ఆమె అన్నారు. గెలిచిన తర్వాత నియోజకవర్గంలో రాహుల్ ఒక్కసారి మాత్రమే పర్యటించారని స్మృతి గుర్తు చేశారు. రాహుల్ పర్యటనను మీరు సందేహించవచ్చు కానీ, తన పర్యటనను కాదని మంత్రి పేర్కొన్నారు. గత లోకసభ ఎన్నికల్లో అమెథీలో రాహుల్ గాంధీపై పోటీ చేసి స్మృతి ఇరానీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇక పర్యటనలో చివరగా మాట్లాడుతూ... ప్రస్తుతం రాహుల్ తన జాడల్లో నడుస్తున్నాడని ఆమె పేర్కొన్నారు. మరోవైపు స్మృతి ఇరానీ అమేథీ పర్యటన నేపథ్యంలో, మే 18 నుంచి రెండు రోజులపాటు పర్యటిస్తానని రాహుల్ ప్రకటించడం కొసమెరుపు.