కేసీఆర్ కేబినెట్ లో కీలక మంత్రులుగా ఉన్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యక్ష ఎన్నికలంటేనే భయపడిపోతున్నారట. డిప్యూటీ సీఎంగా రాజయ్య భర్తరఫ్ తర్వాత అనూహ్యంగా ఆ పదవి దక్కించుకున్న కడియంతోపాటు 30 ఏళ్ల టీడీపీతో మైత్రిని తెగదెంచుకొని టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న తుమ్మలకు అటు అసెంబ్లీలోగానీ, ఇటు మండలిలోగానీ సభ్యత్వం లేదు. దీంతో నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా వారివురు ఏదో ఒక సభలో కాలు మోపక తప్పని పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ సీట్లకు ప్రత్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో పోటీచేయలేమని వారిద్దరు చేతులెత్తేస్తున్నారని అధికారిక సమాచారం. సేఫ్ ఎంట్రీగా పరిగణిస్తున్న ఎమ్మెల్యేకోటాలో అవకాశానికే వారిద్దరు ప్రాధాన్యమిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ స్థానం నుంచి టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాదరావును ఎంపిక చేయగా, మరోకరి కోసం గులాబీబాస్ గాలిస్తున్నారట. ఇదిలా ఉంటే ప్రత్యక్షపోరుకు ఆసక్తిచూపని వీరిద్దరు టీడీపీ వారు కావటం, వీరివురు గతంలో చంద్రబాబు హయాంలో కేబినెట్ లో కీలకమంత్రులుగా వ్యవహారించటం విశేషం.