నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేసిన సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కొద్దిసేపటి క్రితం తన దీక్షను విరమించారు. కాపులకు రిజర్వేషన్ల కోసం ఏపీ ప్రభుత్వం నుంచి ఓ స్పష్టమైన హామీ రావటంతో తగ్గినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతినిధులుగా ముద్రగడ ఇంటికి వచ్చిన టీడీపీ ఏపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, ఏపీ కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దౌత్యం ఫలించింది. కాపులకు రిజర్వేషన్లపై ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన వెంటనే నిమ్మరసం తెప్పించిన కళా వెంకట్రావు, ముద్రగడ నోటికి స్వయంగా అందించారు. దీంతో ముద్రగడ నాలుగు రోజుల దీక్ష విరమించినట్లైంది.
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆదేశాలతో టీడీపీ ఏపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, ఏపీ కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులు ముందుగా ముద్రగడతో భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన చర్చల తర్వాత వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ముద్రగడ అంగీకరించారు. ఆపై కాసేపటికి దీక్ష విరమణ జరిగింది. మరి ప్రభుత్వం నుంచి అందిన హామీలేంటో ముద్రగడ ప్రెస్ మీట్ లో తెలియజేయనున్నట్లు సమాచారం.