ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభాన్ని కలిసేందుకు రాజమండ్రి చేరుకున్న దర్శకరత్న దాసరి నారాయణరావు ఓ హోటల్ లో బస చేయగా, హోటల్ చుట్టూ పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. కిర్లంపూడికి దాసరి చేరుకుంటే, కొంత ఉద్రిక్తత తలెత్తవచ్చని పోలీసులు భావిస్తుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దాసరి హోటల్ బయటకు వస్తే అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో కిర్లంపూడికి వెళ్లే మార్గంలో తమను అడ్డుకోవద్దని దాసరి తదితరులు ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దాసరి నారాయణరావును అరెస్ట్ చేయాలని గానీ, కిర్లంపూడికి వెళ్లనివ్వాలని గానీ పోలీసు వర్గాలకు ఎటువంటి స్పష్టమైన ఆదేశాలూ లేకపోవడంతో వారు అయోమయంలో ఉన్నారు. ఇదిలావుండగా, తనను కలిసేందుకు డాక్టర్లకు సైతం అవకాశమివ్వని ముద్రగడ, తలుపులు బిగించుకుని దీక్ష కొనసాగిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు చూస్తుంటే బాధ కలుగుతోందని ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు అన్నారు. రాజమండ్రిలో ఓ మీడియా ఛానెల్ తో ఆయన మాట్లాడారు. ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి రాజమండ్రి చేరుకున్నానని తెలిపారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, డిక్టేటర్ పాలనలో ఉన్నామా అని ఆయన ప్రశ్నించారు. తెలుగు జాతికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. క్రిమినల్స్ ను వెంటాడినట్టుగా తమను వెంటాడం సరికాదని భావ్యం కాదన్నారు. అర్థరాత్రి అడవుల గుండా ప్రయాణించి రావాల్సి వచ్చిందని ఆయన వాపోయారు. ఎలాగైనా ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నట్టు చెప్పారు. అయితే తనను పోలీసులు అనుమతిస్తారా, లేదా అనేది తెలియదన్నారు. తునిలో జరిగిన ఘటనలు పునరావృతం కాకూడదని దాసరి ఆకాంక్షించారు.