బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలివిడత ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 5 దశలుగా జరగనున్న ఎన్నికల్లో, సోమవారం 49 స్థానాలకు ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండానే జరిగాయి. నువ్వా-నేనా అన్న రీతిలో బీజేపీ జనతాపరివార్ కూటమిలు ప్రచారం చేసి ఎన్నికల బరిలో దిగాయి. 17 ఏళ్ల బంధాన్ని పక్కనబెట్టి ఎన్టీఏకు వ్యతిరేకులుగా మారిన ఆర్జేడీ, ఎస్పీ పార్టీలతో చేతులు కలిపి నితీశ్ బరిలో దిగారు. ముఖ్యంగా మోదీ హవాకు ఎదురెళ్లి మరీ పోటీనిచ్చారు.
అయితే తొలి దశ పోలింగ్ ముగిసిన వేళ వెంటనే సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఆయన జోస్యం చెబుతున్నారు. అనుకూల పవనాలు వీస్తున్నాయని, మహాకూటమి ఓడిపోనుందని వ్యాఖ్యానించారు. బీహారులో తదుపరి ప్రభుత్వాన్ని బీజేపీ స్థాపించనుందని ఆయన అన్నారు. తామంతా కలసికట్టుగా ఉండలేకపోయామని, నితీశ్ తమలో చీలిక తెచ్చాడని దుయ్యబట్టారు. మహాకూటమి ఓటమికి ఇదే ప్రధాన కారణమని అన్నారు.
అంతే కాదు జేడీ యూ సీనియర్ నేత, ముఖ్యమంత్రి అభ్యర్థి నితీష్ కుమార్ లాలూను, తమను(సమాజ్ వాద్ పార్టీని) మోసం చేశాడని ఆరోపించారు. జనతా పరివార్ ను ఏర్పాటు చేసినప్పుడు ఒకలా, ఆపై సీట్ల పంపిణీలో మరోలా వ్యవహరించారని ఆరోపిస్తూ నితీశ్ తీరును ములాయం తీవ్రంగా ఆక్షేపించారు. మొత్తానికి బీహార్ నుంచి తమ పార్టీ పూర్తిగా నిష్క్రమించనుందని జోస్యం చెప్పారు. ములాయం వ్యాఖ్యలు ప్రస్తుత బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అయితే బీహార్ ఎన్నికలు మొదటి దశ ముగియగానే ములాయం లాంటి ఓ సీనియర్ నేత ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యటం జనతాపరివార్ నైతిక్ ఓటమితోపాటు, ప్రజల్లో కూటమి పట్ల నమ్మకం సన్నగిల్లేలా ఖచ్ఛితంగా చేస్తుంది. ఇవి తదుపరి పోలింగ్ పై ప్రభావం చూపుతుందనటంలో కూడా ఎలాంటి సందేహం లేదు.