నాన్నకు ప్రేమతో...

December 15, 2015 | 11:16 AM | 2 Views
ప్రింట్ కామెంట్
KTR-vs-Nara-lokesh-in-GHMC-elections-niharonline

ఓవైపు తమ మధ్య ఉన్న వ్యక్తిగత వైరాలను పక్కనపెట్టి ఇరువురు తెలుగు సీఎంలు అప్యాయతను ఒలకబోస్తూ కలుస్తూ ఉంటే, మరోవైపు వారి వారసులు పోరాటానికి సిద్ధమైపోతున్నారు. ఈ వైరానికి ఆజ్యం పోసేది గ్రేటర్ హైదారాబాద్ ఎన్నికలు కావటం విశేషం. ఓవైపు ఆంధ్రా ఓట్లతో ఎలాగైనా సరే మేయర్ పీఠం దక్కించుకుందామని టీడీపీ-బీజేపీ కూటమి భావిస్తుంటే, మరోవైపు కొన్ని సీట్లైనా గెల్చుకుని పరువు కాపాడుకుందామని కాంగ్రెస్ ఆరాటపడుతుంది. అయితే గ్రేట‌ర్ పీఠం అధికార టీఆర్ఎస్ పార్టీదేన‌ని, త‌రువాత స్థానం ఎంఐఎంకు ద‌క్కుతుంద‌ని తాజాగా ఓ సర్వే ప్రకటించింది. దీంతో  టీడీపీలో కాస్త కలవరపాటు నెలకొంది.

గ్రేటర్ లో పసుపుపచ్చ జెండా ఎగరకపోతే తమ పార్టీ తెలంగాణ నుంచి పూర్తిగా నిష్క్రమించినట్లేనని అధినేత చంద్రబాబు భావిస్తున్నాడు. దీంతో తనయుడు నారా లోకేష్ ను సీన్లోకి దించాడు. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేశ్ మంగళవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ముఖ్య నేతలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ తదితరులు హాజరుకానున్న ఈ భేటీలో ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్లు సమాచారం.

ఇక మరోవైపు గ్రేటర్ లో కూడా ఎగిరేది గులాబీ జెండానే అని కేసీఆర్ తనయుడు ఐటీ మంత్రి కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. సంక్షేమమే ధ్యేయంగా పని చేసే ప్రభుత్వానికే ఆంధ్రా సోదరులు పట్టం కడతారని కేటీఆర్ వ్యాఖ్యానించాడు కూడా. అంతేకాదు ఆపరేషన్ ఆకర్ష్ బాధ్యతలను తన నెత్తిన వేసుకుని కీలక నేతల చేరికను దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడు. గ్రేటర్ ఎన్నికల్లో విజయాన్ని తన పనితనంగా చూపించి తద్వారా తండ్రి దగ్గరే కాదు మొత్తం పార్టీ దృష్టిలో మంచి మార్కులు కొట్టేయాలని కేటీఆర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలా ఎవరికి నాన్నకు ప్రేమతో గ్రేటర్ గెలుపును గిఫ్ట్ గా ఇద్దామని ఎత్తుగడలు వేస్తున్నారు. తండ్రులేమో చేతులు కలిపి ముందుకెళ్తుంటే... వారి కొడుకులు మాత్రం కత్తులు దూసుకోవటం ఏంటో? రాజకీయ వర్గాలు మాత్రం తనయుల మధ్య పోటీని ఆసక్తిగా గమనిస్తున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ