ఏపీలో సంచలనం రేపిన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ లను వారి మేనల్లుడు చింటూ రాయల్ అలియాస్ శ్రీరామ చంద్రశేఖరే పొట్టనబెట్టుకున్నాడు. తన అనుచరులతో కలిసి ఏకంగా చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ లో పట్టపగలు అతడు వారిని అంతమొందించాడు. సొంత మేనమామ, అత్తలను పొట్టనబెట్టుకోవాల్సిన అవసరం చింటూకు ఎందుకు వచ్చింది? మొన్నటిదాకా మేనమామ వెన్నంటే ఉన్న చింటూ ఆ తర్వాత ఎందుకు వ్యతిరేకిగా మారాడు? ఈ విషయాలన్నిటికీ దాదాపుగా సమాధానాలు దొరికేశాయనే చెప్పాలి. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న చింటూ ఈ హత్యలను తానే చేసినట్లు ఒప్పుకున్నాడు.
ఇంజినీరింగ్ పూర్తి చేసిన చింటూ, ఆ తర్వాత ముంబైలో చేస్తున్న మంచి ఉద్యోగాన్ని వదిలేసి మేనమామకు అండగా నిలిచాడు. ఈ క్రమంలో తన మేనమామపై దాడి చేయించారన్న ఆరోపణతో చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే జయచంద్రారెడ్డి (సీకే బాబు)పై దాడి కూడా చేశాడు. అయితే అనురాధ చిత్తూరు మేయర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కఠారి మోహన్ కుటుంబానికి చింటూ క్రమంగా దూరమయ్యాడు. తర్వాత ఇరు వర్గాల మధ్య శత్రుత్వం కూడా ఏర్పడింది. చింటూకు పెళ్లి కాకుండా కఠారి దంపతులు యత్నించారు. అంతేకాక చింటూను క్రిమినల్ గా వారు చిత్రీకరించారు. ఈ రెండు కారణాలతోనే చింటూ వారిపై కక్ష పెంచుకుని అత్యంత దారుణంగా చంపేశాడు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం చిత్తూరులో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ ఈ విషయాలను వెల్లడించారు.