ఆస్తుల ప్రకటనతో విపక్ష నాయకమ్మన్యులు లోకేష్ పైన, బాబుపైన దృష్టిపెట్టి దుమ్ముదులుపుతున్నారు. మధ్యతరగతి, పైమధ్యతరగతి నియో రిచ్ సరసులందరూ జోకులు పేలుస్తున్నారు. రాజకీయంగా లక్ష్మీపార్వతి నందమూరి, పద్మవాసిరెడ్డి, రాంబాబు అంబటి ముందువరసలో ఉండి చీల్చి చెండాడుతున్నారు.
ఊరుపేరులేని ఓ మాదిరి భాగ్యవంతులు లోకేష్ బాబు వెల్లడించిన ఫిగర్సు చూసి ముఖ్యమంత్రి కంటే మనమే రిచ్ రోయ్ అని అందర్నీ పిలిచి సంబరపడుతున్నారు. రామచంద్రయ్య చార్టెడ్ అకౌంటెంట్, అంబటి దర్యాప్తునకు సిద్ధమా అని నిలదీస్తున్నారు. వీళ్లగోలలో వీరుండగానే అక్కడ నిమిష నిమిషానికి ఆస్తులు తామరతంపరగా పెరిగిపోతుండటం గమనించుకోవటం లేదు రామచంద్ర, రాంబాబులు! మనం రోజూ చూసే లారీల వెనుకభాగంలో ఉండే స్లోగన్లు గుర్తుకొస్తున్నాయా? ఆస్తిపరులైన ఈ తండ్రీకొడుకుల చొక్కాల వెనుక వీపు మీద ‘నన్ను చూసి ఏడవకురా’ అని రాసి ఉందో ఏమో మరి!