ప్రజల పట్టాభిషేకం-అనాయాసమరణం-ఇంకేంకావాలి!
రాజు మరణించే ఒక తార రాలిపోయే
కవియు మరణించే ఒక తార గగనమెక్కె
రాజు నివసించు రాతి విగ్రహములయందు
కవి నివసించె ప్రజల నాలుక యందు...
అన్నాడో మహకవి. సరిగ్గా కలాంకు అది వర్తిస్తుందనడంలో అతిశయోక్తిలేదు. ఓ ముస్లిం అయి ఉండి అన్ని మతాలను గౌరవించడం, అందరితో మమేకమయి వారితో సన్నిహితంగా మెదగడం ఈయనలాంటి వారికే సాధ్యమయ్యే పని. అందుకే ఆయన అందరి వాడు. ఆయన హఠాన్మరణంతో కుదేలు అయినవారు ఎందరో. పేద కుటుంబం అయినా సంపాదించిన దాంట్లో కొందరికైనా అన్నదానం చేయాలన్న ఆలోచన ఎందరికి ఉంటుంది. మతపిచ్చి పీక్ లో ఉన్న సమయంలోనే ఓ ముస్లిం అయి ఉండి భగవద్గీత, ఇతిహాసాలను అవపోసన పట్టాడు. విద్యార్థి దశలో తాను ఎదుర్కున్న కష్టాలు మరెవ్వరూ అనుభవించకూడదనే ఉద్దేశంతోనే వారిని తన ఉపన్యాసాలతో ప్రభావితం చేశాడు. అందుకే ఆయన జీవితం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. వివేకానందుడి సూక్తుల తర్వాత కలాం కొటేషన్ల్ రెండో స్థానంలో నిలిచాయంటేనే అర్థమౌతుంది... ఆయన మాటలు ఎంత ప్రభావితం చేస్తాయో. 400 వందల మంది విద్యార్థులు హాజరైన ఓ మీటింగ్ లో హఠాత్తుగా కరెంట్ పోతే, వయసు మీద పడ్డా వారి మధ్యలోకి వెళ్లి మరీ ఉపన్యాసం ఇచ్చాడంటే ఓపిక ఎంతో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రపతిగా ఉన్న సమయంలో కూడా ప్రజావ్యతిరేక బిల్లులను ముక్కుసూటిగా, మారు మాటల్లేకుండా వెనక్కి తిప్పిపంపిన ఘనత ఈయనదే. రెండోసారి రాష్ట్రపతి పదవికి ఎంపికైనప్పుడు అభ్యంతరం చెప్పే అవకాశం (ఒక్క లాలూ తప్ప) లేకున్నా వద్దనుకున్నాడు. అప్పట్లో శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో ఓ ప్రయోగానికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హాజరయ్యారు. దురదృష్టవశాత్తూ సదరు ప్రయోగం విఫలమై రాకెట్ సముద్రంలో కూలిపోయింది. ఆ మిషన్‌కు అబ్దుల్ కలాం డైరెక్టర్‌గా వ్యవహరించలేదని తెలుసుకున్న ప్రధాని రాకెట్ కూలిపోవడంలో ఆశ్చర్యమేమీ లేదని అన్నారట. ఆయన మీద అంత నమ్మకం మరి. అలాంటి కలాం మీద ఖాన్ లాంటి పాక్ శాస్త్రవేత్తలు పిచ్చి ప్రేలాపనలు చేసినా అవన్నీ ప్రజాభిమానం అనే ప్రవాహంలో కొట్టుకుపోతాయన్నది గ్రహించాలి. ఏ రంగంలో ఉన్నారనది సంబంధం లేకుండా ప్రజలంతా ఆయన మృతికి సంతాపం తెలపడం, స్పందించిన తీరు అమోఘం. చరిత్రలో ఇలా ఎవరికీ నివాళులర్పించలేరన్నది కూడా పచ్చి నిజం. బతికున్నప్పుడు కాదు చనిపోయాక కూడా ప్రజల హృదయాల్లో మెదులుతూ ఉండేవాళ్లే మహనీయులు. అలాంటి వాళ్లలో ఏపీజే అబ్దుల్ కలాం ఒక్కరు. కలకాలం కలాం దేశప్రజల మనస్సులో నిలిచి ఉంటాడు. జైహింద్...