రాష్ట్రం సస్యశామలంగా ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిష్టాత్మకంగా చేపట్టాడు అయుత మహా చండీయాగం. ఐదు రోజులపాటు కొనసాగనున్న ఈ యాగం బుధవారం ఉదయం వైభవంగా ప్రారంభమైంది. ఎర్రవల్లి సమీప ప్రాంతం మొత్తం వేదపఠనాలతో మారుమ్రోగిపోతుంది. అయితే ఓవైపు ప్రతిపక్షాలు సైతం సైలెంట్ అయి లోకల్ మీడియా ఊదరగొడుతున్న సమయంలో నేషనల్ మీడియా మాత్రం ఆసక్తికర కథనాలు ప్రసారం చేస్తున్నాయి. యాగం పేరిట దుబారా ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నాయి. యాగానికి రూ.3 కోట్లే ఖర్చవుతుందని కేసీఆర్ ప్రకటించినప్పటికీ అసలు ఖర్చు రూ.7 కోట్లు గా తేలిందని తెలిపింది. అంతేకాక ఈ నిధుల్లో సర్కారు నిధులు సింగిల్ పైసా కూడా లేదని కేసీఆర్ ప్రకటించారని, కానీ అందులో నిజానిజాలు ఏంటో లెక్కలు తీస్తే తెలుస్తుందని కథనంలో పేర్కొంది. తన సొంత నిధులతో పాటు మిత్రులు, శ్రేయోభిలాషులు అందించిన నిధులతో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
మరోవైపు రైతుల ఆత్మహత్యలను హైలెట్ చేస్తూ... వారి ఆవేదన పేరిట కథనాలను వెలువరించింది మరో ప్రముఖ చానెల్. యాగ క్షేత్రానికి కేవలం 10 కిలో మీటర్ల దూరంలోని పీర్లపల్లికి చెందిన రైతు నల్లా కిష్టయ్య అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తొమ్మిదో తరగతి చదువుతున్న కిష్ణయ్య కొడుకు రాజు తన విద్యాభ్యాసాన్ని నిలిపివేశాడు. 'ఏ అండా లేని మాలాంటి వాళ్లను ముఖ్యమంత్రి ఆదుకోవాలి. లేకపోతే పిల్లలని ఎలా చదివించుకోగలను?' అంటూ కిష్టయ్య భార్య ఆవేదన వ్యక్తం చేస్తున్న వైనాన్ని డాక్యుమెంటరీ రూపంలో ప్రసారం చేసింది ఇంకో చానెల్. మొత్తానికి రాష్ట్రపతితో సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరుకానున్న ఈ యాగంపై నెగటివ్ కథనాలు అదీ జాతీయ మీడియాలో రావటం గమనించదగ్గ అంశం.