నోటుకు ఓటు... రెండు తెలుగు రాష్ట్రాలను ప్రస్తుతం ఓ ఊపు ఊపేస్తున్న వ్యవహారం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం టీ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి డబ్బును మారుస్తూ రెడ్ హ్యండెడ్ గా చిక్కుకున్నారు. అయితే ఈ వ్యవహారంలో టీ ప్రభుత్వం మొదటి నుంచి దూకుడు ప్రదర్శిస్తూనే ఉంది. కీలకమైన ‘బాస్’ వ్యవహారం కావటంతో అచ్చోచ్చిన ఆయుధంలా దీన్ని వాడుకుని టీడీపీపై విరుచుకుపడేందుకు తెరాస ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ కీలకమైన అంశమేంటంటే... ఫిర్యాదుదారుడి రికార్డు టేపుల ఆధారంగానే ఈ వ్యవహారం అంతా నడవటం. కానీ, టీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తొలుత భిన్నంగా మాట్లాడుతూ... ఆ బాస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబే అని, బాబుకు స్టీఫెన్ సన్ ల ఆడియో టేపులు ఏసీబీ వాళ్ల దగ్గర ఉన్నాయని చెప్పటం నుంచి తీవ్ర గందరగోళానికి దారితీసింది. అనుహ్యాంగా వాటికి మీడియా ముందుకు తెచ్చి పెద్ద వివాదానికే దారితీయించింది. ఇక్కడ సమస్యేటంటే... ఇలాంటి ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టకుండా మీడియాకు ఇవ్వటమేంటనే... ఒకవేళ కోర్టులో వాటిని ఇచ్చి ఉంటే సమస్య ఇంత జఠిలమయ్యేదనా అని ఓ వర్గపు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తొటి తెలుగు రాష్ట్రం పైగా భవిష్యత్తులో ఖచ్చితంగా అవసరాలు ఉంటాయి. ఈ నేఫథ్యంలో ఇలాంటి సీరియస్ మ్యాటర్ ను తెరపైకి తెచ్చి తెలంగాణ ప్రభుత్వం పెద్ద తప్పిదమే చేసిందని మరికొందరి అభిప్రాయం. అవసరాల సమయంలో వారు స్పందిస్తారా అన్నది ఇక అనుమానమే అని వారంటున్నారు. ఇక ఎలా ఎదుర్కొవాలో తెలీక ఉన్న ఏపీ టీడీపీ శ్రేణులు కేసీఆర్ పై కేసుల పేరిట కాలయాపన చేస్తున్నాయే తప్ప, సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేవు. ఏపీ సలహాదారు పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ... చట్టపరంగా పోతామని చెప్పటం దేనికి నిదర్శనం. ఆయన వాదించేది ఏంటంటే... ప్రభుత్వమయి ఉండి ఒక తోటి ముఖ్యమంత్రి ఫోన్ ను ట్యాప్ చేసి సంభాషణలను రికార్డు చేయటం ఎంతవరకు కరెక్టని. అంతేగానీ, అవి చంద్రబాబువి కావు అని ఆయన ఎక్కడా వాదించకపోవటం గమనార్హం. ఇక్కడ ఎవరిది కరెక్ట్, ఎవరిది రాంగ్ అన్నది మ్యాటర్ కాదు. రెండు రాష్ట్రాలు కొత్తగా ఏర్పడ్డవే. రెండింటికీ సుస్థిరత ఏర్పాడలంటే కొంత కాలం ఆగాల్సిందే. మరి ఇలాంటి సమయంలో ఈ సమస్యతో ఎలా నెట్టుకొస్తాయన్నదే ప్రధానం. భవిష్యత్ టీఆర్ఎస్ తరపున ఏదైనా ఛాన్స్ దొరికితే టీడీపీ వదులుతుందా. అసలు ఇప్పటికే అలాంటిదేమైనా దొరుకుతుందా అని నిఘా కూడా పెట్టి ఉంటుంది. జాతీయ స్థాయిలో మోదీకి చంద్రబాబును దూరం చేసేందుకు ఈ వ్యూహాం పన్నారన్నా, తెరాస, వైఎస్సార్సీపీ లు ఒక్కటయి తెదేపా ను తుదముట్టించాలని చూస్తున్నాయన్నా.. అవన్నీ ఆరోపణల వరకే పరిమితం. పరస్పర మాటల తూటాలతో విరుచుకుపడుతున్న ఈ ఇద్దరు చంద్రులు ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఏం చెప్పినా అది వ్యర్థమే ఎందుకంటే అది వారికి ఏ మాత్రం ఉపయోగపడవు గనుక. ఏదేమైనా నోటుకు ఓటు తో ఎవరికీ చేటు లేదనేది మాత్రం అక్షర సత్యం.