మీరు గమనించారో లేదో! ఓటుకి నోటు వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా ఏ ఒక్క ఏపీ నేత కూడా సీఎం చంద్రబాబుకి మద్ధతుగా మాట్లాడిన పాపాన పోలేదు. వ్యవహారం తెలంగాణ లో ముడిపడి ఉన్నందున టీటీడీపీ నేతలే ఎప్పుడూ బాబుకి అండగా దండగా నిలుస్తూ వస్తున్నారే తప్ప సొంత రాష్ట్రం నుంచి సపోర్ట్ లేదనే చెప్పాలి. ఆరోపణలను ఖండించడం దగ్గరి నుంచి ప్రతీ వ్యవహారంలో అధినేతకు మద్ధతుగా నిలిచారు. ఎవరైనా విమర్శిస్తే చాలూ చీల్చి చెండాడే వరకు నిద్రపోకుండా స్వామి భక్తి ప్రదర్శించారు టీ తమ్ముళ్లు. కానీ, ఏపీ దగ్గరి కొచ్చేసరికి మంత్రులు కాదు కదా చిన్నస్థాయి నేత కూడా ఏ ఒక్కరూ బాబుపై వచ్చిన నిందలను ఖండించలేకపోయారు. కేవలం తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేసి తప్పుడు పని చేసిందని వ్యాఖ్యానించారే గానీ, తమ అధినేత నిర్దొషి ఏ ఒక్కరు కూడా క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించలేదు. అయితే ఇప్పుడు ఒక్క పెద్దాయన ఆయనకు మద్ధతుగా మాట్లాడి హైలెట్ అయ్యారు. ఆయనే మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి.
ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కావాలనే ఇరికించారని ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అనంతపురంలో పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ఆయన మీడియాతో ఓటుకు నోటు అంశంపై పెదవి విప్పారు. అభివృద్ధిలో చంద్రబాబుతో పోటీపడలేకే తెలంగాణ ప్రభుత్వం ఈ కుట్రకు పాల్పడిందని చెప్పారు. ఇప్పటి దాకా ఈ అంశంలో చంద్రబాబుపై 25 కేసులు నమోదయ్యాయని, విచారణలు కూడా జరిగాయని, అయినా, ఏ ఒక్క కేసులో కూడా చంద్రబాబు తప్పుచేసినట్టు రుజువు కాలేదని చెప్పారు. ఇక మీద ఎన్ని కేసులు నమోదయినా బాబు కడిగిన ముత్యంలా బయటికి వస్తారని పల్లె వ్యాఖ్యానించారు. ఇప్పటిదాకా నోరు మెదపని ఏపీ నేతలు తీరా అంశం చల్లబడే సమయానికి మాట్లాడం నిజంగా చాలా చాలా సంతోషం.