బెజవాడలో కలకలం రేపుతున్న కాల్ మనీ(కామ) పునాదులు కదులుతున్నాయి. పోలీసులు పెద్ద ఎత్తున సోదాలు చేస్తూ పత్రాలు, నగదు స్వాధీనం చేసుకుంటున్నారు. కేసులో బడా నేతల హస్తం ఉన్నట్లుగా ఆరోపణలు రావటంతో ఆ కేసును సిట్‌కు అప్పగించే యోచనలో పోలీసులు ఉన్నారు. ముఖ్యంగా అధికార పక్షానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ఇందులో ఉన్నారని ఆరోపణలు రావటం కలకలం రేపుతోంది. విజయవాడలో వెలుగు చూసిన ఈ దందా పొరుగున ఉన్న కృష్ణా, గుంటూరు, కడప జిల్లాల్లో విస్తరించి ఉండటంతో ఆయా జిల్లాలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అధికారికంగా ఇప్పటి వరకు 40కి పైగా ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.
ఇక మరోవైపు కొద్దిరోజులుగా కలకలం రేపుతున్న కాల్ మనీ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ స్పందించింది. అధిక వడ్డీ వసూలు మాటున మహిళలపై అఘాయిత్యాలు బయటికి రావటంతో కాస్త గరం అయినట్లు తెలుస్తోంది. ఆపై అధికార పక్షనేతల పేర్లు బయటికి వస్తున్న నేపథ్యంలో ఆ అంశంపై పోరాడాలని కార్యకర్తలకు ఆయన సూచించారట. దీంతో బుధవారం విజయవాడలో ఆ పార్టీ పోరాటానికి దిగింది. నగరంలోని కాళేశ్వరరావు మార్కెట్ వద్ద ఆ పార్టీ కార్యకర్తలు ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాల్ మనీ వ్యవహారంలో మహిళలను వేధిస్తున్న వ్యాపారులను ఉరితీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాల్ మనీ రాబందులను ఎన్ కౌంటర్ చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే విమర్శలు తలెత్తటం, పైగా ఇఫ్పుడు జససేన ఈ వ్యవహారంలోకి జోక్యం చేసుకోవటంతో కేసును సీరియస్ గా తీసుకోవాలని ఏపీ చంద్రబాబు పోలీస్ శాఖను ఆదేశించారట.