ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాల్లో గత కొద్దికాలంగా నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూనే వస్తున్నాడు. ముఖ్యంగా కీలకమైన భూసేకరణ అంశంలో మంత్రుల వ్యంగ్య కామెంట్లతో మనస్థాపం చెంది వెంటనే అక్కడి రైతులను కలిసి తన మద్ధతును ప్రకటించాడు. రైతు వ్యతిరేక విధానాలు చేపడితే తనలో ఉగ్ర అవతారం చూస్తారని హెచ్చరించాడు కూడా. అవసరమైతే ఆమరణ దీక్షకు కూడా వెనకాడబోనని హెచ్చరించాడు కూడా. దీనిపై కాస్త వెనక్కి తగ్గిన ప్రభుత్వం అందుకు సంబంధించిన చర్యలను చేపట్టింది.
మెల్లిగా చాప కింద నీరులా పాకుతూ ప్రజల్లో ముఖ్యంగా రైతుల్లో పాపులారిటీ పెంచుకుంటున్న పవన్ ను కెలిగి అనవసరమైన రచ్చ ఎందుకని అనుకుంది కాబోలు. ఈ మేరకు వారికి కృతజ్నతలు తెలుపుతూ పవన్ నిన్న ట్విట్టర్లో ట్వీట్ కూడా చేశాడు. మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలకు ఇతర మంత్రి వర్యులకు, ముఖ్యంగా సీఎం చంద్రబాబుకు స్పెషల్ థాంక్స్ కూడా చెప్పాడు. ఇంత వరకు బాగానే ఉంది వెనువెంటనే ఆయన చేసిన మరో ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాలపై మరింత దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అదే ప్రత్యేక హోదా అంశం. కీలకమైన ఈ విషయంలో మరికొంతకాలం వేచిచూద్దామని ఆయన ప్రజలకు సూచించారు. విభజన సమయంలోనే ఈ విషయాన్ని మోదీకి వివరించానని, ఆయన అర్థం కూడా చేసుకున్నారని ఈ విషయంలో సానుకూల నిర్ణయం వస్తుందనే భావిస్తున్నానని తెలిపాడు. ‘దేశ సమగ్రతని దృష్టిలో ఉంచుకుని దీనిపై ఇంకొంతకాలం వేచిచూద్దాం. అప్పటికీ న్యాయం జరుగని పక్షంలో దానిని ఎలా సాధించాలో ఆలోచిద్దాం.’’ అంటూ ట్వీట్ చేశాడు.
భూసేకరణతో అధికార పక్షాన్ని బెంబేలెత్తించిన పవన్.. ఇప్పుడు ఈ ట్వీట్ తో కేంద్రాన్ని కూడా టార్గెట్ చేశాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రత్యేక విషయంలో ఏమైనా తేడాలు జరిగితే మాత్రం ఓవైపు చంద్రబాబును, మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీని కూడా పవన్ ఎసుకుంటాడనటంలో ఏమాత్రం సందేహం లేదు.