ఓవైపు రాష్ట్రం మొత్తం ఓటుకు నోటు వ్యవహారంతో అట్టుడికిపోతుంటే జన సేన అధినేత పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండటం తీవ్ర చర్చనీయాంశమైంది. తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న ఈ అంశంపై అన్ని పొలిటికల్ పార్టీలు తమ తమదైన శైలిలో విరుచుకుపడ్డాయి, పడుతూనే ఉన్నాయి. సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యవహారంలో ప్రధాన పాత్రధారి అని ఆరోపణలు వస్తున్నప్పుడూ కళ్యాణ్ కినుక వహించటం వెనుక ఆంత్యర్యం ఏంటని నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎంత రాజకీయ మిత్రుడైనప్పటికీ ఇలా ఓ కేసులో ఆయన ఉన్నప్పుడు పెదవి విప్పకపోవటం శోచనీయమంటున్నారు. అవసరమైనప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఎప్పుడూ ముందుంటానన్న ఆయనకు ఏమైందని వారంటున్నారు. ఇటీవలె రామ్ గోపాల్ వర్మ‘‘ పాలకుల్ని ప్రశ్నిస్తాననే వాడు ప్రశ్నించనప్పుడు, కళ్యాణం కోరుకునే జనాలకి ప్పెళ్ళెప్పుడు? ప్రశ్నిస్తానన్న వాడు ప్రశ్నించనప్పుడు లోక కల్యాణానికి ద్రొహమ్..ఇది కళ్యాణ ద్రోహం. అంటూ పవన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. మరి ఇలాంటి సమయంలో పవన్ ఇప్పుడు చంద్రబాబుకు తన తోటలో కాసిన మామిడి పళ్లను పంపటం తీవ్ర చర్చనీయాంశమైంది. ఓటుకు నోటుపై తమ నేత ఏపీ ప్రభుత్వాన్ని కడిగిపారేస్తాడనుకున్న జన సేన కార్యకర్తలతోసహా పవన్ అభిమానులు కూడా పవన్ చర్యతో షాక్ కి గురయ్యారు. సినిమా వాళ్లకు పండ్లు పంపాడంటే ఓ అర్థం ఉంది. కానీ, ఇప్పటికే ఆరోపణలు వెలువెత్తుతున్న సమయంలో చంద్రబాబు కు ఇలా స్నేహ సూచికంగా మామిడి పండ్లను పంపటం ఎంత వరకు సమంజసమో ఆలోచించాలి. ప్రశ్నించకపోగా పైగా ఇలా పండ్లతో సరిపెట్టాడని అనుకోవాలా?