సార్వత్రిక ఎన్నికల ఓటమితో పూర్తిగా మసకబారిపోయిన యూపీఏ ప్రతిష్టను తిరిగి తెచ్చేందుకు రంగంలోకి దిగాడు రాహుల్. అయినప్పటికీ విమర్శలకు తప్పించి ప్రజలను ఆకట్టుకునేంతగా ఆయన పనితనం లేదన్నది సీనియర్ల వాదన. దీంతో సోనియా వారసురాలు ప్రియాంక గాంధీని రంగంలోకి దించేందుకు ఆమధ్య ప్రయత్నాలు కొనసాగాయి. అయితే భర్త వాద్రాపై ఉన్న ఆరోపణలతో ఆమె ముందుకు వచ్చేందుకు ఇష్టత చూపలేదు. అయితే రానున్న యూపీ ఎన్నికలలో ప్రియాంక గాంధీని రంగంలోకి దింపితే విజయావకాశాలు మెరుగుపడతాయనే వాదన కాంగ్రెస్ పార్టీ లో వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంక గాంధీని బరిలోకి దింపాలని, ఆమె నాయకత్వాన్ని కోరుకుంటున్న పార్టీ వర్గాలు వాదిస్తున్నాయి. కాగా, ఎన్నికల సమయం సమీపిస్తున్న ప్రతిసారీ, ఈ తరహా వాదనలు తెరపైకి రావడం సహజమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్గీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న నేపథ్యంలోనే యూపీ సీఎం అభ్యర్థిగా ప్రియాంక పేరుపై ప్రచారం జరుగుతోందని వారు అభిప్రాయపడ్డారు.