షాక్: పట్టిసీమ ఓ పనికిరాని ప్రాజెక్ట్!

September 26, 2015 | 12:07 PM | 5 Views
ప్రింట్ కామెంట్
bjp-purandeswari-shocking-comments-on-pattiseema-niharonline

రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసిన ప్రాజెక్టు పట్టిసీమ. దేశంలోనే ఏ నేత వల్ల కానీ నదుల అనుసంధానాన్ని సాధించిన ఘనత ఆయన సొంతం అయ్యిందని సొంత నేతలతోపాటు మీడియా కూడా కోడై కూసింది. పోలవరం ఆలస్యం అయ్యే నేపథ్యంలోనే పట్టిసీమను అల్టర్ నేట్ గా వాడి రాయలసీమకు నీళ్లు అందించాలన్నదే ఆయన ఉద్ధేశం. అయితే అసలు పట్టిసీమతో నిజంగా సీమకు లాభం ఉందా? బాబు చేసిన భగీరథ ప్రయత్నం వృథానేనా అన్నదే ప్రశ్న. ఈ విషయంలో మిత్రపక్షం నుంచే ఆయనకు పెద్ద పంచ్ పడింది.

బీజేపీ నేత, ఆయన సమీప బంధువు దగ్గుబాటి పురంధేశ్వరి బాబుకు షాకిచ్చారు. అసలు చంద్రబాబు ప్రకటనల్లో నిజముందా? అంటూ ఆమె ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రాయలసీమకు ఏమాత్రం ప్రయోజనం లేదని కూడా ఆమె వ్యాఖ్యానించారు.

చిత్తూరులో పర్యటనలో భాగంగా ఆమె మాట్లాడుతూ... పట్టిసీమ ఎందుకూ పనికిరాదని, కేవలం మూడేళ్లు మాత్రమే అందుబాటులో ఉండే పట్టిసీమపై చంద్రబాబు ప్రభుత్వం హడావిడి చేస్తోందని ఆరోపించారు. పోలవరం పూర్తయితేనే రాయలసీమకు న్యాయం జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై అవగాహన ఉన్న కారణంగానే కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు రూ.450 కోట్లు విడుదల చేసిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ రెండు శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయిందని ఆమె నిందలేశారు.

దీంతో పట్టిసీమతో నదుల అనుసంధానాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి దేశంలోనే గొప్ప ఫీట్ ను సాధించామని  చెప్పుకుంటున్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు పెద్ద షాకే తగిలిందని అనుకోవచ్చు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ