విశాల ఆంధ్ర విడిపోవడం కొందరికి ఖేదం, కొందరికి మోదం. దీన్లో క్షతగాత్రమైన ఆంధ్రరాష్ట్రం దారి తెన్నూ లేక, పాలనా కేంద్రం లేక ఒకసారి వైజాగు, మరోమారు రాజమండ్రి అంటూ సంచారం జీవనం సాగిస్తోంది. తెలంగాణ సోదరులకు, ఈ ఘనత మాదే సుమి అని మొత్తుకున్నారు కాంగేయులు. తెలంగాణలో మారుమూల పల్లెల్లో కూడా ఈ మహాప్రసాదం తెచ్చింది ఇచ్చిందీ మనమేనని చెప్పండర్రా అని అధిష్ఠానం రాష్ట్ర కాంగ్రెస్ చెవిలో గుణిగింది. కాని కలువల రాయుడి చాణక్యం ముందు పప్పులుడకలేదు. సోనియాగాంధీ ఇంట్లో గ్రూపు ఫోటో తీయించుకున్న వెంటనే వెనుతిరిగి, చిన్న కన్ను గిలుపుడు వెక్కిరింతతో బెబ్బెబ్బే అని ఈల వేసుకుంటూ రాజధానిలో రెడీ గా వెయిట్ చేస్తున్న సింహాసనంపైపు వడివడిగా అడుగులు వేశాడు.
తమ సొంత ప్రతిభ మీద గాక, ఎదిరి పక్షం తప్పుల్ని సాకుగా, అదనుగా తీసుకుని ఊపిరిపీల్చుకున్న కాంగ్రెసు గొంతు విప్పుతోంది. దాన్లో భాగంగా హంతక మంత్రసాని వారసులు అనంతపురం జిల్లాలో రాహుకాలం చూసుకుని పర్యటనకు తెగువ చూపడం జరిగింది. అవశేషాంధ్రలో ఒక్కసీటు రాలేదెందుకనే ఇంగితం ఉండాలిగా... చావు జాబా మోగుతున్న వాకిట్లో కెళ్లి సంగీత దర్శకత్వం వహిస్తే ఎలా ఉంటుంది. గుడ్డిలో మెల్లగా అమ్మపేరెత్తకుండా అమ్మమ్మ పేరు, నాన్న పేరు మాత్రమే ఉటంకిస్తున్న రాహులుడు కొంత ప్రాప్తకాలజ్నత అలవరుచుకన్నట్టే, ఆంధ్రకు ప్రత్యేక హోదా గురించి గట్టిగా మాట్లాడి రాష్ట్రకూటుల మనసు జయిద్దామనుకుంటున్నాడు. కాలం ఎలాంటి గాయన్నయినా మానుపుతుందా? గాయమయితే మానొచ్చుగానీ వైకల్యం పోవాలిగా!