కేంద్రప్రభుత్వం 2015-16 గానూ రైల్వే బడ్జెట్ ను గురువారం మధ్యాహ్నం ప్రవేశపెట్టింది. దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న ఈ బడ్జెట్ ను రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు మధ్యాహ్నం 12 గంటల సమయంలో చదివి వినిపించారు. అన్నట్లుగానే సామాన్యుడిపై భారం లేకుండా ఛార్జీల పెంపు చేయట్లేదని తెలిపారు. ప్రస్తుత బడ్జెట్ లో వేగం, క్షేమం, ఆదునీకీకరణలే తమ ప్రభుత్వ ప్రాధాన్యాలని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. పార్లమెంటులో రైల్వే బడ్జెట్ ప్రసంగంలో భాగంగా తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను ముందుగా ప్రస్తావించిన మంత్రి, తర్వాత తనదైన శైలిలో ప్రసంగాన్ని పూర్తిచేశారు. ఇక అందులోని కీలక విషయాలు రైల్వే బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు... కేవలం 5 నిమిషాల్లోనే ప్రయాణికులకు టికెట్ల జారీ. ప్యాసింజర్ ఛార్జీలు యధాతధం. 77 పెండింగ్ ప్రాజెక్టుల కోసం ఏకంగా రూ. 96 వేల కోట్లు కేటాయించారు. కొత్తగా 1.38 లక్షల కిలో మీటర్ల మేర రైల్వే లైన్ల ఏర్పాటు. ప్రైవేట్ భాగస్వామ్యంతో కొత్త ప్రాజెక్టులు. ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ట్రాల భాగస్వామ్యం. రైళ్లలో బయో టాయిలెట్స్ ఏర్పాటు. అది కూడా కేవలం ఆరు నెలల్లో దాదాపు 17 వేల బయో టాయిలెట్స్ ఏర్పాటు లక్ష్యం. 650 రైల్వే స్టేషన్లలో కొత్తగా టాయిలెట్స్ నిర్మాణం. ఇకపై నాలుగు నెలల ముందుగానే రిజర్వేషన్ సౌకర్యం. రాజధాని ఎక్స్ ప్రెస్ ల వేగం పెంపునకు చర్యలు. మహిళల భద్రతకు టోల్ ఫ్రీ నెంబరు 182. లేడీస్ కాంపార్ట్‌మెంట్లలో సీసీటీవీలు ఏర్పాటు. ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు కృషి. రానున్న ఐదేళ్లలో 8. 5 లక్షల కోట్ల పెట్టబుడులు. ఇక ఊహించినట్లుగానే సరుకు రవాణాతో ఆదాయం పెంచుకోబోతున్నట్లు మంత్రి తెలిపారు. ఇక ప్రధాని మానసపుత్రిక అయిన స్వచ్ఛ్ భారత్ నినాదాన్ని ను స్టేషన్లలో, రైళ్లలో పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రైల్వే ప్రయాణికుల కోసం 138 టోల్‌ఫ్రీ నంబర్‌తో 24 గంటలు ఫిర్యాదుల స్వీకరణ . 1,052 స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే ఏ1 స్టేషన్లలో ఉచితంగా వైఫై సౌకర్యం కల్పిస్తున్నట్లు, దీన్ని మరింత విస్తరించేందుకు క్రుషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. సీనియర్ సిటీజన్‌లకు ఆన్‌లైన్ వీల్ చైర్ బుకింగ్ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ట్రాక్ లపైనే బుల్లెట్ ట్రెయిన్ పరుగులు తీసేలా అందుబాటులోకి తెస్తామన్నారు. రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారం భారీగా పెంచేవిధంగా రూపకల్పన చేయనున్నట్లు చెప్పారు. కాపలాలేని క్రాసింగ్‌ల వద్ద ఆడియో, వీడియో హెచ్చరికల జారీ వ్యవస్థ ను ఏర్పాటుచేయనున్నట్లు ఇందుకోసం ఇస్రో, కాన్పూర్ ఐఐటీ సహకారం తీసుకొనున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రాలన్నింటికీ ఈ బడ్జెట్ లో సమాన హోదా కల్పించామని ఆయన చెప్పారు. కొత్త రైళ్ల వివరాలను పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోగా వెల్లడిస్తామని అన్నారు. ఇలా కొత్త రైళ్లు, రైల్వే లైన్ల ప్రస్తావన లేకుండా రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే ప్రథమం.