కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిరిసిల్ల రాజయ్య ఇంటిలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న అగ్నిప్రమాదం గురించి తెలిసిందే. ఆయన కోడలు సారికతో సహా ముగ్గురు మనవళ్లు అగ్నికి ఆహుతి అయిపోయారు. ప్రమాదం జరిగి 24 గంటలు గడుస్తున్నప్పటికీ ఈ దారుణ ఘటనకు సంబంధించిన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే మంగళవారం రాత్రంతా రాజయ్య ఇంటిలో పెద్ద ఎత్తున గొడవ జరిగిందని స్థానికుల చెబుతున్న విషయాలను బట్టి తెలుస్తోంది. ఈ గొడవకు రాజయ్య కోడలు ఏఐసీసీ పెద్దలకు పంపిన ఈ-మెయిళ్లే కారణమని విశ్వసనీయ సమాచారం. తనను, తన పిల్లలను పట్టించుకోని కుటుంబానికి వరంగల్ ఉప ఎన్నికలో పార్టీ టికెట్ ఎలా ఇస్తారని రాజయ్య కోడలు ఏఐసీసీ పెద్దలకు లేఖలు రాసిన విషయం తెలిసిందే.
మొన్న ప్రచారంలో బిజీబిజీగా ఉన్న రాజయ్య రాత్రి పొద్దుపోయాక ఇంటికి వచ్చారు. ఆయన ఇంటికి రాకముందే ఈ-మెయిళ్లపై సారిక.., ఆమె భర్త అనిల్, అత్త మాధవిల మధ్య పెద్ద ఎత్తున గొడవ నడిచిందట. రాజయ్య వచ్చిన తర్వాత ఈ గొడవ మరింత పెద్దదిగా మారిందని తెలుస్తోంది. పార్టీ టికెట్ కోసం ఒంటరిగా బరిలోకి దిగి ఎలాగోలా టికెట్ సాధించుకుంటే, ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైతే ఎలాగంటూ సారికపై అనిల్ విరుచుకుపడినట్లు సమాచారం.
అయితే తనను, పిల్లలను పట్టించుకునే విషయంలో ఇదే తరహా ఆసక్తి కనబరిస్తే అసలు గొడవే లేదు కదా? అని సారిక వారితో వాగ్వాదానికి దిగినట్లు కూడా తెలుస్తోంది. అంతేకాక తనతో ఇలాగే గొడవ పడితే మరోమారు మీడియా ముందుకు వెళతానని సారిక వారికి తేల్చిచెప్పిందని సమాచారం. ఈ క్రమంలో గొడవకు ఫుల్ స్టాప్ పెట్టిన రాజయ్య, అనిల్, మాధవిలు తమ తమ గదుల్లోకి వెళ్లగా సారిక కూడా పిల్లల వద్దకెళ్లి నిద్రకు ఉపక్రమించింది. తీరా తెల్లవారుజామున చోటుచేసుకున్న ప్రమాదంలో సారిక తన ముగ్గురు పిల్లలతో కలిసి మంటలకు ఆహుతి అయ్యింది.