తెలంగాణ టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై మండిపడుతున్నారు. కొద్దిసేపటి కిందటే టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రులంతా తమ సోదరులేనని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యానించడంపై మండిపడ్డారు. ఎన్టీఆర్ ట్రస్ట్ర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఓట్ల కోసమే ఆంధ్రా సోదరులు అంటున్నారని ఆరోపించారు. గతంలో కేసీఆర్ ఆంధ్రావారిపై ద్వేషభావం ప్రదర్శించలేదా? అని ప్రశ్నించారు. ఆంధ్రా వంకతో తొలగించిన 26 కులాలను తిరిగి బీసీల జాబితాలో చేర్చుతారా? అని రేవంత్ నిలదీశారు. హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని సీఎంకు సవాల్ విసిరారు. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికకు ప్రత్యక్ష ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పై సీబీఐ కేసు ఉన్నందునే యాగానికి ప్రధానమంత్రి రాలేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తాగి ఇంట్లో పడుకున్న రోజుల్లోనే సైబరాబాద్ ను చంద్రబాబు నిర్మించారని, ఈ నగరం ఆయన శ్రమేనని స్పష్టం చేశారు.
ఇక వెనువెంటనే ఆ పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం సైబరాబాద్ ను ఏర్పాటు చేసిందనే విషయాన్ని మంత్రి కేటీఆర్ మరచినా తెలంగాణ ప్రజలు మర్చిపోలేదని పేర్కొన్నారు. ఆయన నిర్వహించే పారిశ్రామిక సదస్సు, అంతర్జాతీయ ఐటీ సదస్సులన్నీ తమ అధినేత చంద్రబాబు కట్టిన హైటెక్ సీటీలోనే అన్న సంగతి మర్చిపోయారా? అని నన్నూరి మీడియా సమావేశంలో ప్రశ్నించారు. హైదరాబాద్ ను ఎవరు అభివృద్ధి చేశారో కేటీఆర్ కు తెలియకుంటే మీ నాన్న(కేసీఆర్)ని అడిగి తెలుసుకోవాలని సూచించారు. చీమలు పెట్టిన పుట్టల్లో పాములు దూరినట్టుగా... టీడీపీ హాయంలో అభివృద్ధి చేసిన ఫలాలనే ప్రస్తుతం అనుభవిస్తూ కేటీఆర్ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.