ప్రస్తుతం ఉన్న తెలంగాణ మంత్రి మండలిలో సీనియర్ ఎవరంటే అది నాయిని నర్సింహా రెడ్డి మాత్రమే. వయస్సుతోపాటు అనుభవరీత్యా ఆయనే పెద్ద. యువకుడిగా ఉన్న సమయంలో యూనియన్ లీడర్ గా పనిచేసిన ఆయన ఆ తర్వాత కూడా రాజకీయ సంబంధాలను కొనసాగించి టీఆర్ఎస్ లో చేరాడు. అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టే కేసీఆర్ ఆయనకు హోంమంత్రి పదవిని కట్టబెట్టారు.
కానీ, ఆయన ఎన్నిక పట్ల చాలా మందిలో ఇప్పటికీ వ్యతిరేకత ఉంది. రాజకీయ నేతగా అపార అనుభవం ఉన్న ఆయనకు ప్రజల్లో అంత పాపులారిటీ లేదనేది వారి అభిప్రాయం. అంతేకాదు హోంమంత్రిగా ఆయన దారుణంగా విఫలమవుతున్నారని ప్రతిపక్షాలు సైతం విరుచుకుపడుతున్నాయి. దీనిపై తాజా సమావేశాల్లో భాగంగా గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన స్పందించారు. తెలంగాణ లో ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ లో తన హయాంలో నేరాలు బాగా తగ్గాయని ఆయన అంటున్నారు. ఒకవేళ అది అబద్ధమని నిరూపిస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయాల్లో సెల్ ఫోన్లలో పేకాట ఆడుతున్నారని, మంత్రిగా నాయిని ఉన్నా ఏం లాభం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు ఆరోపణలకు దిగారు. దీనిపై నాయిని పై విధంగా స్పందించారు. వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. పెట్రోలింగ్ వాహనాలు ఎక్కినప్పుడు, పోలీసులు తమ ఫోన్లను సరెండర్ చేస్తారని చెప్పారు. శాంతిభద్రతలను కాపాడే పోలీసులను అవమానపరిచేలా మాట్లాడటం మంచిది కాదని అన్నారు.
నాయిని చెబుతున్న లెక్కలకు, నేర విభాగం ఇచ్చిన రిపోర్ట్ కి ఏ మాత్రం సంబంధం లేకుండా ఉంది. క్రైం రేట్ తగ్గిందని నాయని చెబుతున్నా అవన్నీ ఉత్త మాటలే అని స్పష్టంగా తెలుస్తుంది కదా అని విపక్షాలు గొణుక్కుంటున్నాయి. ఆ లెక్కన నాయిని రాజీనామా చేస్తారా మరి! లేక కేసీఆర్ ఆయన్ను తప్పిస్తారా?