ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం దిశగా సాగుతోంది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రేస్ లను చావుదెబ్బ కొట్టిన 'ఆప్' ఇప్పుడు సగర్వంగా ఢిల్లీ పీఠం అధిష్ఠించనుంది. గత ఏడాది ఏ రోజైతే సిఎం పదవిని తృణప్రాయంగా వదిలేసారో తిరిగి అదే రోజున (14 ఫిబ్రవరి) ఢిల్లీ పీఠాన్ని ఎక్కనున్నారు. ఇది ప్రజల ప్రేమకు నిదర్శనం. అసలు ఈ స్థానంలో ప్రభంజనం ఎలా సాధ్యమైంది? అంటే, అందుకు కేజ్రీవాల్ సమర సన్నద్ధత, ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలు కూడా తోడ్పడ్డాయని చెప్పవచ్చు. అరవింద్ కేజ్రీవాల్ అన్నీ తానై బలగాలను నడిపారు. ఇతర పార్టీలు, మత సంస్థల సహకారం తీసుకోకుండా, తన పేరు మీదే ఎన్నికల బరిలోకి ఉరికారు. ఆప్ నిధుల రూపంలో అందింది నల్లధనం అని ఆరోపణలు రాగానే, తన సచ్ఛీలత నిరూపించకునేందుకు ప్రయత్నించారు. గతంలో 49 రోజుల పాలన అనంతరం తప్పుకున్నందుకు నిజాయితీగా ఢిల్లీ ప్రజలకు క్షమాపణలు తెలిపారు. ప్రత్యర్థులను వ్యక్తిగతంగా విమర్శించకుండా, ఢిల్లీ అభివృద్ధే తన అజెండా అని చాటారు. అటు, ఆయా రాష్ర్టాల ఎన్నికల్లో వన్ మ్యాన్ ఆర్మీలా వ్యవహరించి బీజేపీకి విజయాలు కట్టబెట్టిన మోదీకి సైతం ధీటుగా నిలిచారు. రూ. 10 లక్షల విలువైన సూట్ ధరించిన మోదీ కంటే మఫ్లర్ మ్యాన్గా వినుతికెక్కిన కేజ్రీవాలే మిన్న అని ఢిల్లీ ఓటరు మీట నొక్కి మరీ చెప్పాడు. మూణ్మాలుగు నెలల ముందే ఎన్నికల సన్నాహకాలకు దిగడం కూడా ఆమ్ ఆద్మీ పార్టీని ముందంజలో నిలిపింది. ఆ పార్టీ నేతలు, వలంటీర్లు ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసి పార్టీ విధివిధానాలను విశదీకరించారు. తద్వారా, ఆప్ వైఖరి ఏమిటన్నదానిపై ఓటరుకు స్పష్టత ఏర్పడింది. అదే సమయంలో బీజేపీ, కాంగ్రేస్ లు కేజ్రీవాల్ పై విమర్శలకే ప్రాధాన్యమిచ్చి దారుణమైన తప్పిదానికి పాల్పడి ఓటమికి గురయ్యాయి. గత ప్రభుత్వాల పాలనతో ఎంతో విసిగిపోయిన ఢిల్లీ ప్రజలకు ఆ రెండు పార్టీల ధోరణి మరింత ఏహ్యభావాన్ని కలిగించింది. ఆ తీవ్ర విముఖతే ప్రజల ఆలోచనలకు పదును పెట్టే ఆయుధమై తత్పలితంగా నేడు ఫలితాల రూపంలో వెల్లడైంది. అవినీతిపై పోరాడుతాడు అన్నది కేజ్రీవాల్ ట్యాగ్ లైన్ లా ఉపకరించింది. మచ్చలేని వ్యక్తిత్వం కావడంతో ప్రజలు ఆయనపై నమ్మకముంచారు. గతంలో చేసిన తప్పు మరోసారి జరగదని బహిరంగ క్షమాపణ చెప్పడం ద్వారా ఆయనకు ఎన్నికల ముందే గెలిచారని ప్రీ పోల్స్ ద్వారా స్పష్టమైంది. ఎప్పుడూ కాంగ్రేస్ కు మద్దతిచ్చే దళితులు, ముస్లీంలు ఈ సారి ఆప్ కు జైకొట్టారని అర్థం చేసుకోవచ్చు. అటు, కిరణ్ బేడీని సీఎం అభ్యర్థిగా ఎంపిక చేయడంతో బీజేపీలో విభేదాలు తలెత్తడం తెలిసిందే. స్థానిక నేతలను కలుపుకోలేక పోవడం ఆమె వైఫల్యాల్లో ఒకటి. కనీసం తాను విజయం సాధించలేకపోయింది. కేజ్రీవాల్ చర్చకు రమ్మని విసిరిన సవాల్ కు ధీటుగా స్పందించకపోవడం ఆమెకు మైనస్ లా మారింది. కార్టూన్ ప్రకటనలతో కేజ్రీవాల్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నామని బిజేపీ నేతలు భావించినా, ప్రజల్లో ఆయనపై సానుభూతి అంతకు రెట్టింపైంది. ఒక్కడిపై ఇంతమంది పోరు సాగిస్తున్నారన్న విషయం ఓటరుకు తెలియంది కాదు. తనకేం కావాలో అంతకంటే బాగా తెలిసిన సామాన్యుడు కోరుకున్న విజయమిది.