సంవత్సరం క్రితం దేశ ప్రజలందరికీ ఓ ధైర్యం. నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చింది... మంచి రోజులు (అచ్చె దిన్ లు) రాబోతున్నాయి. ఆయన ప్రభుత్వం కొలువుదీరితే మతోన్మాదం ఉండబోదు అని... మైనార్టీల మద్దతుతో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎంపికైన ఆయనకు మత మానసిక రుగ్మత లేదని, కావున ఆయన హయాంలో బతుకులు బాగుపడతాయని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర విశ్వాసం వ్యక్తంచేసేరు. కానీ, మత ఘర్షణలకు అడ్డూ అదుపూ ఉండదని పేర్కొన్న కొందరి భయాలు నిజమేనని ఇప్పుడిప్పుడు రుజువవుతోంది. తాజాగా పార్లమెంటుకు హోంమంత్రిత్వ శాఖ ఇచ్చిన లెక్కలు ఈ విషయాన్నే దృవీకరిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుండి జూన్ వరకు దేశంలో మొత్తం 330 మతఘర్షణలు జరిగాయట. వాటిల్లో 51 మంది బలయ్యారుట. దాదాపు 1092 మంది క్షతగాత్రులుగా మిగిలారు. మరి ఇప్పుడు పూర్వగణాలను పరిశీలిద్దాం... 2014లో ఇదే సమయంలో నమోదైన మత ఘర్షణలు 252. అప్పుడు మరణించింది 33 మందే.
మరిప్పుడు లెక్కలు దేనికి నిదర్శనం. అందరికీ అచ్చెదిన్ లు తెస్తానని మోదీ ఎన్నికల నినాదమిచ్చినపుడే వామపక్షాలు నిలదీశాయి. ఈ ముసుగు వెనక అసలైన మతోన్మాద ఎజెండా ఉందని హెచ్చరించాయి. లెక్కలు పరిశీలిస్తే... గత 14 నెలల పాలన అదేనన్న సందేహం లేదు. ముజఫర్‌నగర్ మతఘర్షణల్లో కీలక ముద్దాయి సంజీవ్ బలియాన్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని తమ పంథా స్పష్టంగా బయటపెట్టారు. ఐతే మతోన్మాద చిచ్చురేపి హిందూ ఓట్లను సంపాదించాలన్న వ్యూహంలో సంఘ్ పరివార్ కొన్ని మార్పులు చేసినట్లు కనబడుతోంది. భారీస్థాయి ఘర్షణలకు బదులుగా చిన్న, చిన్న గొడవలకు తెరలేపి వాటి ఆధారంగా ప్రజల్లో మతపరమైన చీలికలు తీసుకురావాలన్నది వారి ఉద్దేశ్యం. ఒక ఆంగ్ల దినపత్రిక పరిశోధన ప్రకారం కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన 10 వారాల్లో ఒక్క ఉత్తరప్రదేశ్‌లో 600 మతఘర్షణలు చోటుచేసుకున్నాయి. మరో భయంకర విషయమేంటంటే దళితులు, ముస్లింలు కలిసి నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఈ రెచ్చగొట్టే సంఘటనలు జరిగాయి. దళితుల్లో ముస్లిం వ్యతిరేకత నూరిపోసి, వారిపై దాడులకు వాడుకునే పంథా ఎంచుకున్నారు. ఇలా అణగారిన వర్గాల్లో చీలికలు సృష్టించి తమ పబ్బం గడుపుకోవాలనే హేయమైన ప్రయత్నమే. దీనికి కాలమే సమాధానం నిర్ణయించాలి.