రాజకీయాల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే... సీన్లోకి ఎవరినైనా లాగొచ్చు. వివాదాలుగానీ, విమర్శలు గానీ ఏదీ వదలకుండా ఎవరి మీద పడితే వారి మీద రుద్దేయొచ్చు. సామాజిక అంశాలపై స్పందించే వారు ఉన్నప్పటికీ ముందుకు రావటం రాకపోవటం సెలబ్రిటీల ఇష్టం. కానీ, ప్రభుత్వం చెయ్యాల్సిన పని వారు చేస్తారా అన్నది ఎంతకైనా అనుమానమే. తాజాగా మహారాష్ట్రలో వరుస ఆత్మహత్యలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక అక్కడి రైతుల్ని ఆదుకునేందుకు పలువురు తారలు ముందుకు వచ్చారు. సీనియర్ నటుడు నానా పటేకర్, అక్షయ్ కుమార్ తదితరులు భారీగానే విరాళాలు ప్రకటించారు. ఇంకొందరు ఆ వరుసలో ఉన్నారు కూడా. అయితే ఇప్పుడదీ ఇక్కడ కూడా పాకాలని కొరుకుంటున్నారు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.
రైతుల కోసం భరోసా యాత్రను టీడీపీ భవన్ నుంచి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగించాడు. మహారాష్ట్ర తరహాలో మన తెలుగు సినిమా తారలు కూడా తెలంగాణ రైతులకు తోడ్పాటు అందించడానికి ముందుకు రావాలని కోరుతున్నాడు. సెలబ్రిటీలు, సినీనటులు, వ్యాపారవేత్తలు అన్నదాతలకు అండగా నిలవాలని రేవంత్ కోరారు. పక్కరాష్ట్రాల నటులకు పోలిస్తే మనవాళ్లు తక్కువేం కాదు, వారిని స్పూర్తిగా తీసుకుని ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఇది తమ రాష్ట్రం కాదు అని వారు భావిస్తే వారిష్టమన్నారు. అయితే వారు స్పందించాలని సూచన మాత్రమే చేస్తున్నామని చివర్లో రేవంత్ వ్యాఖ్యానించడం కొసమెరుపు.