కేంద్రంలో ప్రభుత్వ మార్పిడి తప్పదని ఎన్నికల ముందే అర్థం చేసుకున్న మేధావులు తగ్గట్టే అలా ముందుకు పోయారు. అక్కడ కాషాయం, ఇక్కడ సైకిల్ జోరందుకున్నాయి. విడిపోయిన తర్వాత ఆంధ్ర సర్కారుకి తత్వం బోధపడుతూ వచ్చింది. ప్రత్యేక హోదా వ్యవహారం బేతాళ కథల్లా తయారయింది. దాన్ని అడ్డం పెట్టుకుని ఎవరి మైండ్ గేం వాళ్లు ఆడుతున్నారు. మధ్యలో ప్యాకేజీ తాయిలం ఒకటి చూపిస్తున్నారు.
ఆంధ్ర రాష్ట్రాన్ని కుదురుగా, సౌకర్యంగా ఉండనిస్తే బీజేపీ వేళ్లానుకోలేదేమో అనే కుశ్మంక కేంద్రాన్ని పీడిస్తోంది. దురాశ కాపోతే, రాష్ట్రంలో ఇప్పట్లో దానికి పీఠం దక్కుతుందా? బాబు గ్రహస్థితి వక్రించి రాష్ట్రం సంగతి ఏమిటనేలా కేంద్రం గల్లా పట్టుకోలేకపోతున్నాడు. తెలుగు దేశానికి కడుపు రగులుతున్నా నవ్వు మొఖం తో నటించాల్సి వస్తోంది. ఇటువంటి వాతావరణంలో రాష్ట్రంలో ఏదైనా నలుగురూ గుమిగూడిన చోట మర్యాదల విషయంలో బీజేపీ, టీడీపీ కి తగువులు రావడం చాలా నేచురల్. అధికారంలో ఉన్న తెలుగుదేశం నిన్నటికి మొన్న జెండావందనం ప్రోగ్రాంలో బీజేపీ వారిని పెద్ద చూపు చూడలేదని బావురుమన్నాయి. షేక్ హ్యాండు ఇవ్వలేదని, ఇచ్చినా.. చెయ్యి గట్టిగా నలిపేశారని, కౌగిలించుకోలేదని, ఇచ్చుకున్నా.. గట్టిగా హత్తుకోలేదని, స్టేజీ మీద కుర్చీ వెయ్యలేదనీ, వేసినా.. దానికి మూడే కాళ్లు ఉన్నాయనే కుంటి సాకులతో ఉక్రోషిస్తున్నారు. ఈ మ్యూజికల్ చైరులో పాత్రధారులెవరంటే చంద్రబాబు, విశాఖ ఎంపీ హరిబాబు, గంటా శ్రీను అనీ, ప్లే గ్రౌండు వైజాగనీ గమనించాలి!