తనపై ఏడాది పాటు సస్పెన్షన్ విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇప్పటికే ఓ మారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. గతంలో సుప్రీం ఆదేశాలతో స్పందించిన హైకోర్టు సింగిల్ బెంచ్ రోజా సస్పెన్షన్ ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మరోమారు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గడప తొక్కారు.
అయితే అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన కౌంటర్ ను విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్... సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. దీనిపై వెనువెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావించిన రోజా గత వారం సెలవుల నేపథ్యంలో కాస్తంత ఆలస్యంగా కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రివిలేజ్ కమిటీ ముందుకు తనను పిలవకపోవడం దారుణమని సదరు పిటిషన్ లో రోజా ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సమస్యలపై పోరాడుతున్నందునే తనను అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేశారని కూడా ఆమె ఆరోపించారు.