‘సత్యం’ స్కాంలో రాజుకు ఏడేళ్ల జైలు శిక్ష

April 09, 2015 | 04:05 PM | 40 Views
ప్రింట్ కామెంట్
satyam_ramalinga_raju_imprisonment_niharonline

దేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని సైతం నివ్వెరపరచిన సత్యం కుంభకోణంలో పది మందికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. దాదాపు ఐదేళ్లపాటు సుదీర్ఘ వాదనలు విన్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీవీఎల్‌ఎన్ చక్రవర్తి తన తీర్పును గురువారం ప్రకటించారు. తీవ్ర సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో ఆ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ బైర్రాజు రామలింగరాజుకు ఏడేళ్ల జైలుశిక్ష, రూ. 5 కోట్ల జరిమానా విధించారు. ఆయన సోదరుడు రామరాజుకు కూడా ఏడేళ్ల జైలుశిక్ష, రూ. 5 కోట్ల జరిమానా విధించారు. ఈ కేసులో మొత్తం పది మంది దోషులు ఉన్నారు. మొదటి దోషి రామలింగరాజు కావడంతో ఆయన మీద తీర్పు ముందుగా వెలువడింది. ఇప్పటికే ఆయన 33 నెలల పాటు రిమాండు ఖైదీగా ఉన్నారు కాబట్టి మిగిలిన కాలానికి ఆయన జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. హైకోర్టులో మాత్రమే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం. ఉంది.  ఆయనతో పాటు మొత్తం పది మంది దోషులకు కూడా ఏడేళ్ల జైలుశిక్షనే విధించారు. రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు మినహా మిగిలిన 8 మంది దోషులకు మాత్రం రూ. 25 లక్షల చొప్పున జరిమానా విధించారు. దోషులను నేరుగా కోర్టు నుంచి చర్లపల్లి జైలుకు తరలించే అవకాశం ఉంది. తాను పలు సేవా కార్యక్రమాలు చేపట్టానని, వాటిని దృష్టిలో పెట్టుకునైనా శిక్ష తగ్గించాలని రామలింగరాజు కోర్టును వేడుకున్నారు. తాను ఈఎంఆర్ఐ, 108, తాగునీటి పథకాల లాంటి అనేక సేవలు చేశానని, వయోవృద్ధులైన తల్లిదండ్రులను కూడా చూసుకోవాల్సి ఉందని.. అందువల్ల శిక్ష తగ్గించాలని కోరారు. అయితే ప్రత్యేక న్యాయమూర్తి చక్రవర్తి మాత్రం ఈ వాదనతో  ఏకీభవించలేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంస్థ చైర్మన్ రామలింగరాజును న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది.  రామలింగరాజుతో పాటు ఆయన సోదరుడు రామరాజు, 8 మందిపై నేరం రుజువైంది. 2009 జనవరిలో సత్యం కంప్యూటర్స్ కుంభకోణం బయటపడింది. ఈ కుంభకోణంలో రూ.14 వేల కోట్ల వరకు మోసం చేసినట్లుగా ఆరోపిస్తూ నిందితులపై ఐపీసీ సెక్షన్లు 120(బి) (నేరపూరిత కుట్ర), 409 (నమ్మకద్రోహం), 419, 420 (మోసం), 467 (నకిలీ పత్రాలను సృష్టించడం), 468 (ఫోర్జరీ), 471 (తప్పుడు పత్రాలను నిజమైనవిగా నమ్మించడం), 477ఎ (అకౌంట్లను తారుమారు చేయడం), 201 (సాక్ష్యాలను మాయం చేయడం) కింద సీబీఐ అభియోగాలను నమోదు చేసిన విషయం తెలిసిందే. కోర్టు మొత్తం 226 మంది సాక్షులను విచారించగా, సీబీఐ సమర్పించిన 3,037 డాక్యుమెంట్లను, నిందితులు సమర్పించిన 75 డాక్యుమెంట్లను పరిశీలించి ఆర్నెల్ల క్రితమే తుది విచారణను పూర్తి చేసింది.  కాగా, సత్యం కుంభకోణంపై  ఈడీ నమోదు చేసిన కేసును కూడా ఇదే కోర్టు విచారిస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ