అధినాయకత్వం మార్పుపై చర్చ జరగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీకి కాంగ్రెస్ నేతలంతా అండగా నిలుస్తున్నారు. ఆమె నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాలనే నిర్ణయంపై సీనియర్ నేతలంతా అసంత్రుప్తితో ఉన్నారు. రాహుల్ అనుభవలేమీ, పార్టీ ఘోరంగా దెబ్బతిన్న ఈ స్థితిలో నాయకత్వం నుంచి తప్పుకోవద్దని ఆమెకు సూచిస్తున్నారు. సోనియా ఆదర్శవంతమైన నాయకత్వాన్ని అందించారని కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి అశ్వినీ కుమార్ తెలిపారు. అయితే, అదే సమయంలో ఆమెకు, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీల మధ్య అభిప్రాయభేదాలు ఉన్న మాట వాస్తవమేనని కుమార్ అంగీకరించారు. కాగా, రాజస్థాన్ పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ కూడా అశ్వినీ కుమార్‌తో గొంతు కలిపారు. క్షేత్రస్థాయిలోని కాంగ్రెస్ కార్యకర్తలు సోనియానే అధ్యక్షురాలిగా కొనసాగాలని కోరుకుంటున్నారని అన్నారు. సోనియా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రిటైర్డ్ కాకూడదని మరో నేత వీరప్ప మొయిలీ అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే ముందు రాహుల్ నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని మరో సీనియర్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు. కాగా, సోనియా గాంధీ, రాహుల్ ఆలోచనలు ఒకేలా ఉండవని దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించిన కొద్దిరోజులకే వీరి కామెంట్లు చేయటం గమనార్హం. ఇదంతా చూస్తూంటే సీనియర్లకు సోనియాజీ మీద గౌరవమా లేక రాహుల్ తో పడకపోవటమే కారణమా అన్నది తెలీట్లేదు. మరి ఈ పరిస్థితుల్లో నాయకత్వ బాధ్యతలు యువరాజుకు అప్పగిస్తారా లేదా అన్నది కాస్త సస్పెన్స్ గా మారింది.