విమర్శలు తారాస్థాయికి చేరుకున్నా సరే కిక్కురుమనకుండా ఉండటం మన నేతలకు పరిపాటే. అయితే అవి మిత్ర పక్షాల నుంచే ఎదురవుతే మాత్రం కాస్త ఇబ్బందే. అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం, అలాగని శాశ్వత శత్రుత్వం ఉండదనేది మొదటి నుంచి తెలిసిందే. ఒక గౌరవ ప్రదమైన హోదాలో ఉన్నాడని మరీ ఆలోచించకుండా విమర్శలు చెయ్యటం ఒక ప్రతిపక్షాలకే చెల్లు. ఒకానొక సమయంలో దిగజారి మరీ కామెంట్లు చేసినా కిమ్మనకుండా ఉండటం అవతల వారి ఓపికకు నిదర్శనం.
అయితే అది కలిసే నడిచే కూటమి నుంచే అయితే మాత్రం కొంచెం కష్టం. అదే ఇప్పుడు జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీపై శివసేన మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బీహార్ కు భారీ ప్యాకేజ్ ఇచ్చిన ప్రధాని కాకులను కొట్టి గద్దలకు వేస్తున్నారని మండిపడింది. మహారాష్ట్ర నుంచి సర్ ఛార్జ్ రూపంలో వసూలు చేసిన రూ. 1600 కోట్లను కేంద్రం బీహార్ కు పంచుతోందని విమర్శించింది. మహారాష్ట్ర, విదర్భ, మరట్వాడా ప్రాంతాల్లో వందలాది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని... అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీహార్ కు ఇస్తున్నట్టుగా మహారాష్ట్రకు లక్షా పాతిక వేల కోట్ల ప్యాకేజీ అవసరం లేదని... 20 నుంచి 25 వేల కోట్ల రూపాయలు ఇస్తే సరిపోతుందని సూచించింది. తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో మోదీపై ఈ విధంగా విరుచుకుపడింది. మహారాష్ట్ర ను మోసం చేసి ఆ సొమ్మును మందికి పంచిన ఘనత ప్రధానిదేనని ఎద్దేవా చేసింది.
అయితే ఈ మిత్రబేధం గురించి వీలైనంత త్వరగా సమస్య పరిష్కారం అయితే మంచిదని విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. కీలకమైన నిర్ణయాల్లో కూడా వారి సలహాలేం పనిచెయ్యకపోవటంతో కఠిన నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో శివసేన ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రేంజ్ కామెంట్లు మాత్రం సరికాదని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరీ మోదీ రాయబారంతోనైనా సేన శాంతిస్తుందా చూడాలి.