ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవహార శైలిపై బీజేపీ మిత్రపక్షం శివసేన మండిపడింది. విదేశీ పర్యటనలో భాగంగా మంగోలియాకు బిలియన్ డాలర్ల (మన కరెన్సీ లో దాదాపు రూ.64వేల కోట్లు) ఆర్ధిక సాయం ప్రకటించటం పట్ల సేన తీవ్ర స్థాయిలో ఆగ్రహాం వ్యక్తం చేసింది. మహారాష్ట్రలోని రైతుల విషయంలో ఇంత ఉదారత చూపలేదెందుకని ప్రశ్నించింది. మంగోలియా వంటి చిన్న దేశంతో స్నేహపూర్వక ఒప్పందాలకు భారీ నిధులు కేటాయిస్తూ దేశంలోని రాష్ట్రాలపై చిన్న చూపెందుకని శివసేన అధికార పత్రిక 'సామ్నా' లో ఈ విషయాన్ని ప్రస్తావించింది. నిస్సహాయ స్థితిలో ఉన్న రైతులు కేంద్రం సాయం కోసం ఎదురుచూస్తోంటే కేంద్ర ప్రభుత్వం వారిని కాదని విదేశానికి సాయం చేస్తోందని సామ్నాలో దుయ్యబట్టారు. ప్రధాని ఇటీవల మంగోలియా పర్యటన సందర్భంగా ఆ దేశ మౌలిక సదుపాయాల కల్పనకు 1 బిలియన్ డాలర్లు ఆర్ధిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. డాలర్ తో పోల్చుకుంటే భారత కరెన్సీ విలువ తగ్గుతున్న నేపథ్యంలో మంగోలియాకు భారీ మొత్తంలో సాయం చేయడం ఎందుకని, రాజస్థాన్ లోని జైపూర్‑లో ప్రధాని మోదీ డ్రీమ్ ప్రాజెక్టు అణు శక్తి ప్లాంటు ఏర్పాటుపై ఆర్థిక ప్రతికూల ప్రభావం పడితే ఇబ్బందులు తలెత్తుతాయని శివసేన విమర్శించింది.