ఏపీలో కాపుగర్జన తరహాలో హర్యానా లో జాట్ కులస్తులు చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఉద్యోగాలు, విద్యావకాశాల్లో తమకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ హర్యానాలోని జాట్ కులస్తులు విధ్వంసం సృష్టించారు. ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కెప్టెన్ అభిమన్యుకు చెందిన రోహ్ తక్ లోని ఇంట్లోని వస్తువులను, ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. అనంతరం ఇంటికి నిప్పు పెట్టారు. కాగా, ఈ సంఘటన జరిగిన సందర్భంలో ఆర్థిక మంత్రి తన నివాసంలో లేరు. చండీగఢ్ కు వెళ్లారు. ఇంట్లో ఆయన కుటుంబసభ్యులు మాత్రమే ఉండటంతో వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ఆందోళనకారుల్లో ఒకరు తుపాకీతో కాల్పులు జరపడంతో వారిని అదుపు చేసే నిమిత్తం పోలీసులు తిరిగి కాల్పులు జరపడంతో ఒక వ్యక్తి చనిపోయినట్లు హర్యానా పోలీస్ చీప్ వైపీ సింఘాల్ పేర్కొన్నారు. అయితే ముగ్గురు చనిపోయినట్లు లోకల్ వార్తా చానెల్ లు కథనం ప్రసారం చేస్తున్నాయి. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసుల వాహనాలను కూడా తగులబెట్టారు. జాతీయ రహదారులను, రైల్వే ట్రాక్ లను దిగ్బంధించారు. దీంతో భద్రతా దళాలను రంగంలోకి దింపారు.
కర్ఫ్యూ విధించిన ప్రాంతాల్లో ప్రజలు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది. రోహ్తక్, భీవానీ ప్రాంతాల్లో జాట్ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. మిగతా మంత్రుల ఇళ్లకు కూడా ఆందోళనకారుల నుంచి ముప్పు ఉండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మొత్తానికి జాట్ ఉద్యమం తీవ్ర రూపం దాల్చటంతో హర్యానా మొత్తం రణరంగంగా మారింది.