తనదైన శైలిలో స్టేట్‌మెంట్లు ఇచ్చే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను అక్కున్న చేర్చుకున్న వెంటనే వాణిజ్యపన్నుల శాఖగా మంత్రిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పించారు. ఆ నమ్మకంతోనే పాలనాపరంగా స్వేచ్ఛను కూడా తలసానికి ఇచ్చి ప్రొత్సహిస్తున్నారాయన. అయితే రాజీనామా చేయాల్సిందేనంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితి నెలకొంది. దీంతో గ్రేటర్ ఎన్నికలకు ముందే తలసాని రాజీనామా చేస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడుతారా అని అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఆ ఒక్కటి తప్ప అన్ని మాట్లాడారు ఆయన.
మీడియాతో ముచ్చటించిన ఆయన కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కు లక్ష ఇళ్లను కేటాయించి, తెలంగాణకు పది వేల ఇళ్లు కేటాయించిన బీజేపీకి రాష్ట్రంలో మాట్లాడే హక్కు లేదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కేంద్రం రాష్ట్రాలను సమదృష్టితో చూడాలని, వివక్ష పాటించకూడదని సూచించారు. కేంద్రం తెలంగాణకు కేటాయించిన ఇళ్ల సంఖ్య చూస్తే వివక్ష ఎంత ఉందో తెలిసిపోతుందని పేర్కొన్నారు.
ఇక ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే దూరం జరిగానని జానారెడ్డి చెబుతున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అలాంటి పదవి తెలంగాణ నేతలకు ఎవరికైనా ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు పేదల కోసం ఏనాడైనా ఏదైనా చేశారా? అని ఆయన అడిగారు. బీజేపీకి కానీ, జానారెడ్డికి కానీ మాట్లాడే హక్కు లేదని ఆయన తెలిపారు. తాము అధికారం చేపట్టగానే పేదల కోసం ఆలోచించడం మొదలు పెట్టామని, వారి సంక్షేమం కోసమే పని చేస్తున్నామని ఆయన వివరించారు. తెలంగాణలో మిగులు విద్యుత్ కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారని, త్వరలో ఇతర రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా చేసే స్థితికి రాష్ట్రం చేరుకుంటుందని ఆయన తెలిపారు. వరంగల్ ఎన్నిక కోసంగా కనిపించినప్పటికీ ఈ రకంగా తన రాజీనామాకు ముందే ఆయన ప్రచారంకు దిగినట్లు తెలుస్తోంది.