నేను గోమాంసం భుజిస్తానని సిద్ధరామయ్య అనగానే జీవకారణ్యమూర్తీ వితరణశీలి అయినట్టి శ్రీరామసేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్ నేనూ నావంతుగా ఓ కేజీ పందిమాంసం బహుకరిస్తాను తిని తరించండి అని కబురు పంపాడు. మీరూ, మీ మతాలు తన్నుకు చావండిగానీ మమల్నెందుకు చంపుకు తింటారని ఆవులు, ఆదివరాహాలు ఘోల్లుమంటున్నాయి. హిందూ దేవుళ్లకూ, దేవతలకు ఒక్కొక్క పక్షినీ, జంతువునీ వాహనంగా ప్రకటించబడి గౌరవిస్తున్నారు. గోవులు హిందూయేతరులకు ఆహారంగానూ, పందులేమో పాశ్చాత్యులకు రుచికరంగానూ వర్థిల్లుతున్నాయి. పందిపేరే ఉచ్ఛరించడానికి ససేమిరా అనే వర్గం అందరికీ తెల్సిందే.
ఏదేమైనా ఈ మూగజీవాల్ని భక్షించేది నరవ్యాఘ్రాలే! మరి సిద్ధరామయ్య ప్రమాణ స్వీకార సందర్భంగా గోరక్షణ తనదే బాధ్యత అని ప్రకటించాడు. మరివాటినే నంజుకు తింటానని అనగానే శ్రీరామసేనుడికి బాగా కాలి పంది మాంసం కూడా భోంచేయ్ అని ఉక్రోషించాడు. పుష్ప విలాపంలో కరుణశ్రీ పబాలల రోదన అవగతమయ్యేలా అక్కటా దయలేనివారు మీ ఆడువారు అని స్త్రీ జాతిని నిందిస్తాడు. సమస్త మానవాళినీ తూర్పారపడుతూ జంతు భక్షకులకు గడ్డిపెట్టే ప్రయత్నానికి కరుణాత్ముడెవరైనా పూనుకుంటే మంచింది. సరేగానీ పూల బాలల్ని కొప్పుల ముడుచుకోవటం మానేసేరా ఆడువారు?