రాజధాని భూ సేకరణ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముక్కుసూటిగా వెళ్తున్నాడని, అధికార పక్షం ఎంతగా వారించినా వినట్లేదని తెలిసిందే. ప్రజా సంక్షేమం దృష్ట్యా అవసరమయితే ప్రభుత్వం కటీఫ్ చెప్పేందుకు కూడా వెనకాడబోనని పవన్ ఇది వరకే చాలా సార్లు చెప్పాడు. దీంతో టీడీపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంటుంది. దీనికి తోడు రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొనటం, పాలనా సౌలభ్యం లేకపోవటం, అధినేతపై ఓటుకు నోటు ఇవన్నీ బోనస్. అయితే ఇలాంటి సమయంలో అనవసర వాదనలకు పోయి జనసేనతో మైత్రిని తెంచేసుకోవటం టీడీపీ కి సుతరాము ఇష్టం లేదు.
ఇదిలా ఉంటే కొందరు అధికారపక్ష నేతలు మాత్రం ఓవైపు పవన్ కు ఏ మాత్రం అవగాహన లేదంటూ తిడుతుంటే, మరికొందరు మాత్రం పొగుడుతూ వస్తున్నారు. పవన్, జగన్ ఇద్దరూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఆసక్తికరమైన జవాబిచ్చారు. రైతుల మీద పవన్ కళ్యాణ్ కు ఉన్నది నిజమైన ప్రేమ అని, జగన్ ది కుట్ర పూరితమైన రాజకీయ మని ఆయన అంటున్నారు. సీఎం కుర్చీ కోసం పాకులాడటమే జగన్ లక్ష్యమని, పవన్ ఉంది ప్రజల కోసమేనని ఆయన పేర్కొన్నారు. దయ చేసి పవన్ జగన్ తో పొల్చి అవమానపర్చవద్దని ఆయన మీడియాను కోరాడు. ఓవైపు తులనాడుతూనే మరో వైపు పోగడ్తలు కురిపించడంలో మర్మం ఏంటో వారికే తెలియాలి. అసలు పవన్ తాజా పర్యటన వెనుక ఉందే టీడీపీ నేతలు అన్నది ఓ టాక్. పైగా పవన్ ను తుళ్లురూ పంపింది మమేకమయ్యేందుకు కాదు... వారిని ఒప్పించి భూములు తీసుకునేందుకే అని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదంతా జగన్ కు చెక్ పెట్టడానికి అధికార పక్షం ఆడుతున్న గేమ్ ప్లాన్ అని వారంటున్నారు. అత్త పొలం అల్లుడి దానం అన్నట్లుగా పవన్, జగన్ లే కాదు, దేవుడే వచ్చి చెప్పినా ఇవ్వడం ఇవ్వకపోవటం అంతా అన్నదాన చేతుల్లోనేగా ఉండేది.