రేవంత్ రెడ్డి బెయిల్ పై సుప్రీంకోర్టులో తెలంగాణ ఏసీబీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. హైకోర్టు రేవంత్ కు బెయిల్ మంజూరు చేయగా, సుప్రీంకోర్టులో తెలంగాణ ఏసీబీ స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేసింది. దానిపై శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం విచారించింది. అయితే ఒక్క రోజు జైలులో ఉండి బెయిల్ అడిగితే తప్పు కానీ, 30 రోజులు జైలులో ఉన్నారన్న సంగతిని న్యాయస్థానం గుర్తుచేసింది. క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ సెక్షన్ 164 ప్రకారం రేవంత్ రెడ్డి వాంగ్మూలాన్ని నమోదుచేశారని గుర్తు చేశారన్న న్యాయస్థానం... ఇప్పుడు మళ్లీ కస్టడీలోకి తీసుకుని ఏం చేస్తారని ప్రశ్నించింది. ఇక కోర్టులో రేవంత్ తరపున ప్రముఖ న్యాయవాది రాంజెఠల్మానీ, తెలంగాణ తరపున కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ వాదించటం విశేషం. హైకోర్టు ఇచ్చిన తీర్పులో లోపాలు ఉన్నాయని సిబల్ వాదించినప్పటికీ ప్రధాన న్యాయమూర్తి ఆయన వాదనతో ఏకీభవించలేదు. అయితే రేవంత్ విడుదలయ్యాక ఆయన చేసిన టీ సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన సీడీల సంగతి పై ఎవరూ పెదవి మెదపకపోవటం విశేషం. ఈ కేసులో తాము ఇప్పుడు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని విచారణ సందర్భంగా ధర్మాసనం తెలిపింది. అయితే కోర్టు పెట్టిన కండిషన్లలో దేనినైనా రేవంత్ ఉల్లంఘిస్తే అప్పడు మా తలుపు తట్టండని అత్యున్నత న్యాయస్థానం ఏసీబీకి సూచించింది.