టెన్నిస్ క్రీడాకారిణి భువన విషయంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తనయుడి పేరు మీడియాలో రావటం కలకలం రేపిన విషయం తెలిసిందే. భువన భర్త అభినవ్ పై తలసాని కుమారుడు సాయికిరణ్ దాడి చేశాడని ఆరోపణలు వచ్చాయి. దీనిపై పలు కోణాల్లో వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. ఇక దీనిపై మంత్రి మీడియాపై ఫైర్ అయ్యాడు. వదంతులను కాస్త సీరియస్ గా పరిగణించిన తలసాని ఆదివారం భువన, ఆమె తండ్రి మహేంద్రనాథ్ రెడ్డితో కలిసి మారేడ్ పల్లి లోని తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.
టెన్నిస్ క్రీడాకారిణి భువన ను ప్రేమ వివాహం చేసుకున్న అభినవ్.. నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడని మంత్రి చెప్పారు. దీంతో ఆందోళన చెందిన మహేంద్రనాథ్‌రెడ్డి.. విషయాన్ని చెప్పేందుకు ఇంటికి వచ్చారని, ఆ సమయంలో తాను లేకపోవడంతో.. సాయికిరణ్‌ను కలిసినట్టు మంత్రి చెప్పారు. విషయాన్ని సాంతం విన్న తన కుమారుడు, తన దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళతానని బాధితుడికి హామీ మాత్రమే ఇచ్చాడని పేర్కొన్నారు.
తన కొడుకేమీ డాన్ కాదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది మీడియా సంస్థల ప్రతినిధులు పనిగట్టుకుని తనపై అసత్య వార్తలను ప్రచురిస్తున్నారని మండిపడ్డారు. తనపై బురద చల్లడం ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. కొందరు మీడియా సంస్థల అధిపతులు స్టార్ హోటళ్లలో తప్పతాగి గొడవలకు దిగితే తానే వారిని రక్షించినట్లు కూడా ఆయన చెప్పుకొచ్చారు. పనిగట్టుకుని తన కుమారుడిపై పలు మీడియా సంస్థలు అసత్య కథనాలతో వార్తలు రాశాయని ఆయన మండిపడ్డారు.
కాగా, టెన్నిస్ క్రీడాకారిణి భువనను ప్రేమించి పెళ్లి చేసుకున్న అభినవ్ మహేందర్‌పై మంత్రి తలసాని కుమారుడు, అతని అనుచరుల దాడి చేశారంటూ మీడియాను ఆశ్రయించాడు. భువన, తాను ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని, భువన తండ్రి మహేంద్రనాథ్‌రెడ్డి అడ్డుపడి.. తమను విడదీస్తున్నారని, ఈ క్రమంలో తలసాని కుమారుడు సాయికిరణ్ తనపై భౌతిక దాడికి దిగి చంపేస్తామని బెదిరిస్తున్నారని అభినవ్ మీడియాకు చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఆదివారం మంత్రితోసహా మీడియా ముందుకొచ్చిన భువన మాత్రం.. తన భర్త(అభినవ్) కట్నం కోసం తనను వేధిస్తున్నాడని, రూ.3 కోట్లు తెస్తేనే కాపురానికి తీసుకెళ్తానని బెదిరిస్తున్నాడని పేర్కొనటం విశేషం.