రాష్ట్ర ప్రగతికి ప్రభుత్వమే అడ్డుపడుతుందంటూ ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ఆరోపణలు గుప్పిస్తున్నాడు. ప్రత్యేక హోదాపై ప్రభుత్వం అశ్రద్ధ కనబరుస్తోందని, చంద్రబాబు చేతగానితనం మూలంగానే ఈరోజు ఈ పరిస్థితి దాపురించిందని తీవ్రంగా మండిపడుతున్నాడు. మరో మూడేళ్లలో రాష్ట్రం భ్రష్టుపట్టిపోవటం ఖాయమని జోస్యం కూడా చెబుతున్నాడు. అయితే దీనిపై అధికార పక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. ఏం అర్హత ఉందని జగన్ రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడని మండిపడుతున్నాయి.
తండ్రిని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని మొత్తం దొచుకుని ఇప్పుడు ఈ పరిస్థితి దాపురించేందుకు కారణం నువ్వు కాదా అని ప్రశ్నిస్తున్నాయ్. టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఓ మెట్టు ఎక్కి మరి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎంపీగా ఉన్నన్ని రోజులు పార్లమెంటులో పిల్లిలా ఉన్న జగన్... బయట మాత్రం పులిలా బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్లమెంటులో కడప పౌరుషం ఏమయిందని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ధర్నాలు, నిరసనలు చేపట్టే నైతిక హక్కు జగన్ కు లేదంటూ మండిపడ్డారు. బీజేపీకి మిత్రపక్షం కావడం వల్లే ఏపీకి రూ. 3 వేల కోట్లను తీసుకు రాగలిగామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి ఏం చేయాలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాగా తెలుసని, ఎవరూ సలహా ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. జగన్ దీక్షను అడ్డుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం ఇవే జగన్ ప్రాథమిక లక్ష్యాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంపై ఎన్ని విమర్శలు చేసినా జగన్ కి మాత్రం తండ్రిలా వారిపై పైచెయ్యి సాధించడం మాత్రం ఎంత ట్రై చేసినా రావట్లేదు.