నోటుకు ఓటు స్కాంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్న విషయం తెలిసిందే. రాజకీయంగా భవిష్యత్ కు ఏంకాకపోయినా అది ఓ పెద్ద మచ్చలా మిగిలిపోతుందన్న బాధలో బాబు ఇప్పటికే కూరుకుపోతున్నారు. ఇక ఇప్పుడు ఈ వ్యవహారం ఆయన తనయుడు, యువనేత లోకేశ్ మెడకు కూడా బిగుసుకునేలా కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో ఆయన తనయుడు నారా లోకేశ్ కూ పాత్ర ఉందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయట. ఈ దిశగా విచారణ జరిపేందుకు అడుగులు వేసింది తెలంగాణ ఏసీబీ. ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులకు ఇటీవల ఓ కీలక ఆధారం దొరికిందట. కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న ముత్తయ్య ఫోన్ నుంచి లోకేశ్ గొంతుతో పోలిన ఓ వ్యక్తి స్టీఫెన్ సన్ తో మాట్లాడారట. సదరు గొంతు లోకేశ్ దే నని తెలంగాణ ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసిన తర్వాతే లోకేశ్ ప్రమేయంపై ఓ నిర్థారణకు రావాలని వారు భావిస్తున్నారట. తొందరపడితే అనవసరంగా నవ్వులపాలవటంతోపాటు ఇరుక్కుంటామనే భావనతో ఈ విషయంలో గోప్యతను ప్రదర్శిస్తున్నారట తెలంగాణ ఏసీబీ అధికారులు. ఒకవేళ సదరు గొంతు లోకేశ్ దేనని తేలితే ఆయన పేరు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చే అవకాశం ఉంది.