ఓటుకు నోటు కేసులో శుక్రవారం టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పై విచారణ సందర్భంగా టీ అడ్వోకేట్ జనరల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విచారణ ముగిసినందున రేవంత్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని రేవంత్ తరపున లాయర్లు న్యాయమూర్తిని కోరగా, దానికి అడ్వోకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి అభ్యంతరం చెప్పారు. ఒకవేళ ఆయనను గనుక బయటికి పంపితే విచారణ ముందుకు సాగదని ఏజీ అన్నారు. రేవంత్ రెడ్డికి రూ.50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయో ఇంకా తేల్చాల్సి ఉందని, ఈ కేసులో ఇంకా చాలా మందిని విచారించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని ఏజీ న్యాయమూర్తికి తెలిపారు. స్టీఫెన్ సన్ కొనుగోలు కు సంబంధించి రూ.2 కోట్లు బేరం కుదిరిందన్న విషయాన్ని ఆయన కోర్టుకు తెలిపారు. రేవంత్ రెడ్డి కేవలం ఒక్క ఎమ్మెల్యేని కొనాలని చూశారని, అంతే ఓ 10 మంది ని కొనుంటే ప్రభుత్వమే కూలిపోయే ప్రమాదం ఉండేదని ఏజీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించటం తీవ్ర చర్చకు దారితీసింది. రేవంత్ రెడ్డికి గనుక బయటికి పంపితే సాక్ష్యులను, సాక్ష్యాధారాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తారని ఏజీ కోర్టుకు విన్నవించారు. ఎమ్మెల్యేలకు లంచం ఇవ్వటం నేరమని, మాజీ ప్రధాని నరసింహారావు కేసును ఈ సందర్భంగా అటార్నీ జనరల్ కోర్టుకు ఉదాహరించారు. ఇక వాదనలు పూర్తికావటంతో న్యాయమూర్తి బెయిల్ పై తుది తీర్పును మంగళవారానికి వాయిదా వేశారు.